ఎదురుదాడులు చేయాల్సిందే.. గులాబీ బాస్ హితబోధ!

Update: 2016-10-22 04:40 GMT

ఎప్పుడూ మన గురించి మనం గొప్పలు చెప్పుకోడమేనా.. అప్పుడప్పుడూ విపక్షాలపై కూడా విరుచుకుపడుతుండాలి.. ఇదీ నిన్న జరిగిన కేబినెట్ మీటింగులో సీఎం కేసీఆర్ పార్టీ నేతలందరికీ ఇచ్చిన అసలు క్లాసు. అధికార పార్టీ కూల్ గా తన పనుల్లో తానుంటే.. ఇటు విపక్షాలు రెచ్చిపోతున్నాయి.. రైతు గర్జనలకు, దీక్షలకు సిద్ధమవుతున్నాయి. ఇవి చివరకు సచివాలయం గేటు ముందు వరకూ చేరడంతో సీఎం బాగా సీరియస్సైపోయారు. ఎప్పడూ ప్రజాసేవ, ప్రభుత్వ పథకాల్లో మునిగిపోవడమేనా.. అప్పుడప్పుడూ విపక్షాలపై విరుచుకుపడుతుండాలని డిసైడయ్యారు. విపక్షాలను బాగా తిట్టడం కూడా నేర్చుకోండి అని అందరినీ ఆదేశించడమే కాదు.. వారి విమర్శలకు.. అదిరిపోయే రేంజిలో కౌంటర్ ఇవ్వాలని.. మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విపక్షాల వాదనలను ఖండించకుంటే.. ప్రజల్లో చులకనైపోతామని సీఎం భావించినట్లున్నారు.. అందుకే గణాంకాలతో సహా వారికి గట్టిగా సమాధానం చెప్పాలనుకుంటున్నారు. రాష్ట్రం కోసం కష్టపడుతున్నప్పుడు.. ప్రజా సంక్షేమ పథకాలతో పరుగులు పెడుతున్నప్పుడు.. వాటిని చెప్పుకోకపోతే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. అయినా ప్రతిపక్షాల పనే అదే కదా.. పాలనలో లొసుగులు వెతకడం.. వాటిని కొండతలు చేయడం. కానీ అవి హద్దు మీరుతున్నా.. పార్టీ నేతలు, మంత్రులు చూస్తూ కూర్చోవడం ముఖ్యమంత్రిగారికి నచ్చనట్టుంది. అందుకే కేబినెట్ మీటింగులో కాస్తా క్లాసు మీద క్లాస్ ఇచ్చారు.

అయినా కేసీఆర్ మైకు ముందుకు వస్తే ప్రత్యర్థులపై పంచులు పడతాయి, సెటైర్లు పేలుతాయి.. అలాంటి కేసీఆర్ పాలనలో బిజీ అయిపోయారు. ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తమకు అప్పగించిన బాధ్యతలతో సతమతం అవుతున్నారు. ఇదే విపక్షాలకు కలిసొచ్చింది.. సర్కారు సైలెంటుగా ఉంది కదా అని వచ్చే ఎన్నికలకు మైలేజీ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టేలా చేసింది. ఫలితంగా తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు. దీన్ని ఇప్పుడే అడ్డుకోకుండే ముందు ముందు ప్రమాదం అని భావించారో ఏమో సీఎం సీరియస్ అయ్యారు. మళ్లీ పార్టీలో పాత జోష్ తీసుకురావాలని చూస్తున్నారు. విపక్షాలను ఎలా ఏకిపారేయాలో స్వయంగా పార్టీ నేతలకు సూచనలిచ్చారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక విపక్షాలపై ఏ రేంజిలో విరుచుకుపడతారో చూడాలి.

Similar News