ఈ కొత్త చట్టం వస్తే ఇక అంతే..

Update: 2017-02-16 04:25 GMT

దేశ జలరవాణా వ్యవస్థకే ముప్పు ఏర్పడనుందా? త్వరలో కేంద్ర ప్రభుత్వం తెస్తున్న చట్టంతో జలరవాణాకే ప్రమాదం ఏర్పడనుందా? అవుననే అంటున్నారు నిపుణులు. చట్టాలను మార్చి కొత్త చట్టాలు తెచ్చి అసలుకే ఎసరు పాలకులు పెడుతున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. మేజర్ పోర్ట్ ట్రస్ట్ యాక్ట్ 1963 లో మార్పులు తెచ్చి మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం చేయడంపై నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొత్త చట్టంతో తంటాలెన్నో....

భారతదేశంలో ఉన్న 11 మేజర్ పోర్టులకు స్వయం ప్రతిపత్తి కల్పించి... నిర్ణయాధికారాన్ని కూడా వాటికే అప్పచెప్పాలన్నదే ఈ కొత్త బిల్లు సారాంశం. దీనివల్ల మేజర్ పోర్టుల సామర్ధ్యం పెంచడంతో పాటు సాధికారత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. పోర్ట్ నిర్వహణలో నైపుణ్యాన్ని పెంచడం, మౌలిక వసతుల కల్పన, వేగవంతమైన నిర్ణయాలు ఈ కొత్త యాక్ట్ తో అమలు జరుగుతాయని పాలకులు చెబుతున్న మాట. ప్రయివేటు పోర్టుల నుంచి పోటీని తట్టుకునేందుకే ఈ చట్టాన్ని తెస్తామని కేంద్రమంత్రులు చెబుతున్నారు. కాని నాణేనికి ఇది ఒక వైపు మాత్రమే. రెండో వైపు కూడా చూడమని నిపుణులు పాలకులకు సూచిస్తున్నారు.

భూమికి భద్రత ఉండదేమో....

మేజర్ పోర్ట్ అధారిటీ బిల్లును గత ఏడాది డిసెంబర్ 16 వతేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీనికి చట్టబద్ధత వచ్చిందంటే ప్రభుత్వరంగంలో ఉండే పోర్ట్ లు మనుగడ కష్టమవుతుందన్నది నిపుణుల వాదన. ఈ కొత్త చట్టం కారణంగా పోర్టులు పూర్తిగా కార్పొరేట్, ప్రయివేటు శక్తుల చేతుల్లోకి వెళతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత చట్టం ప్రకారం పోర్ట్ కు సంబంధించిన భూములను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించడానికి వీలులేదు. కేవలం లీజుకు మాత్రం ఇచ్చుకునే వీలుంది. కానికొత్త చట్టంలో క్లాజు 19 ప్రకారం భూములను అవసరమైతే అమ్ముకునే వీలును కల్పించారు. దీంతో పోర్ట్ భూములను అయినకాడికి అమ్ముకున్నా దిక్కులేదు. దేశ వ్యాప్తంగా 11 మేజర్ పోర్ట్ లకు 73 వేల ఎకరాల భూమి ఉంది. ఒక్క విశాఖ పోర్ట్ కే 7,560 ఎకరాల భూమి ఉంది. కొత్త చట్టం వస్తే ఈ భూములకు భద్రత ఎవరిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. అలాగే పోర్ట్ నిధులు, రిజర్వ్ ఫండ్, కార్మికుల గ్రాట్యుటీ వంటి వాటిని ఇప్పటి వరకు నేషనలైజ్డ్ బ్యాంకుల్లోనే జమ చేస్తూ వస్తున్నారు. కాని కొత్తచట్టంలోని 31 క్లాజు ప్రకారం షెడ్యూల్డ్ బ్యాంకుల్లోనూ జమ చేసుకునే వీలుంది. దీంతో నిధులు పక్కదారి పట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక కొత్త చట్టంలోని క్లాజ్ 30 ప్రకారం విదేశీ బ్యాంకుల నుంచి రుణాలను పొందే వీలుంది. దీనివల్ల విదేశీ బ్యాంకులు విధించే షరతులకు తలొగ్గాల్సి ఉంటుందంటున్నారు. ఇప్పటికైనా దేశ భద్రత, సమగ్రత దృష్ట్యా కొత్త చట్టాన్ని తేకుండా చూడాలని పలు ప్రజాసంఘాలు,నిపుణులు కోరుతున్నారు.

Similar News