చంద్రబాబునాయుడు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఒక ఎజెండా అంశంగా.. ప్రకటించినటువంటిది కాపుల ఆత్మగౌరవ మహా పాదయాత్ర. సహజంగానే ఇలాంటి పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ యాత్రకు అనుమతులు తీసుకోలేదు అనే చిన్న పాయింటు మీద దీనికి బ్రేకులు పడుతున్నాయి. ఇప్పటికే ఒకసారి షెడ్యూలు ప్రకటించిన యాత్రను.. పోలీసుబలగాలతో అనుమతులు లేవంటూ బ్రేకులు వేసిన సర్కారు, రెండోసారి షెడ్యూలు ప్రకటించిన తర్వాత కూడా.. అనుమతి లేకుండా యాత్ర సాగనిచ్చేదిలేదంటూ హెచ్చరిస్తున్నది.
ప్రజాస్వామ్యంలో తమకు అన్ని హక్కులు మరియు స్వేచ్ఛ ఉన్నాయని.. తాము యథేచ్ఛగా పాదయాత్ర సాగించవచ్చునని.. ఎవ్వరినీ అనుమతి అడిగే పనే లేదని ముద్రగడ పద్మనాభం భీష్మించుకుంటున్నారు. ఆయన తనంతగా కాపు ప్రతినిధులతో ఓ మీటింగు పెట్టుకుని.. ఈనెల 25 వతేదీన రావులపాలెం నుంచి అంతర్వేది వరకు యాత్రను ప్రారంభించబోతున్నట్లు చెప్పేశారు.
అయితే ప్రభుత్వం అనుమతి లేకుంటే ససేమిరా అంటూ అప్పుడే బ్రేకులు వేసేస్తున్నది. ముద్రగడ తాజా షెడ్యూలుపై హోం మంత్రి చినరాజప్ప స్పందించారు. తొలిసారి పాదయాత్ర షెడ్యూలు ప్రకటించినప్పుడు కూడా చినరాజప్ప ముద్రగడ ప్రయత్నాలు చాలా ఘాటుగా విమర్శించారు. చంద్రబాబునాయుడు కాపుల సంక్షేమం కోసం ఎంతో చేస్తుండగా, ముద్రగడ ప్రతిదానినీ రాద్ధాంతం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఎంతటి వారైనా సరే అనుమతులు తీసుకోవాల్సిందేనని.. అనుమతి లేకుండా పాదయాత్ర ఉండదని హెచ్చరిస్తున్నారు. ఇరు వర్గాలు కూడా పట్టుదలకు పోతుండడంతో.. ‘అనుమతి’ అనే చిన్న పాయింటు.. చినికి చినికి గాలివానగా మారే అవకాశం కనిపిస్తోంది.