కృష్ణా జలాల పంపిణీలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకు వెళ్లాలా, వద్దా అనే సంశయంలో తెలంగాణ సర్కారు ఉంటే.. ఏపీలో కాంగ్రెస్ కు కూడా అదే ఆలోచన వచ్చినట్టుంది.. కానీ విపక్షం కదా .. అందుకే తమ వంతుగా ట్రైబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ సర్కారుకు ఒక సలహా ఇచ్చేశారు మండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య.. ట్రైబ్యునల్ తీర్పుతో మిగులు జలాలపై ఏపీ హక్కు కోల్పోయిందని.. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందని విమర్శలు సంధించారు. అయినా ఈ వాదన చూస్తే శంకులో పోస్తేనే తీర్థం అన్నట్టుంది.
ట్రైబ్యునల్ తీర్పుపై కోర్టుకు ప్రభుత్వం తరఫునే వెళ్లాలా. విపక్ష సభ్యులుగా సుప్రీంకోర్టులో ట్రైబ్యునల్ తీర్పును ప్రశ్నించే అధికారం వారికి లేదా అని జనం ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర క్షేమం కోరుకునేవాకే అయితే మీరైనా, ఎవరైనా కోర్టు తలుపు తట్టవచ్చు సార్... ప్రభుత్వమే ప్రతి పనీ చేయాలని డిమాండ్ చేస్తూ, వారిని నిందిస్తూ, వారు మీ ఆశలకు తగ్గట్లుగా పనిచేయడం లేదని తూలనాడుతూ.. కాలం గడపాల్సిన అవసరమే లేదు. నిజంగా ప్రజాప్రయోజనాల మీద శ్రద్ధ ఉంటే కృష్ణా నీటి కేటాయింపుల గురించి.. ఒక మామూలు వ్యక్తిగా.. ఏపీ పౌరుడిగా.. రామచంద్రయ్య అయినా సరే.. కోర్టును ఆశ్రయించవచ్చు.
అలా చేయగలిగితే.. ఏపీలో తిరిగి లేచి నిలబడడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తమ ఉనికి కాపాడుకోడానికి ఇది ఒక మంచి అవకాశం కూడా అవుతుంది. అందివచ్చిన అవకాశాలను అందుకుని.. వచ్చే ఎన్నికల్లో అకౌంట్ తెరిచే అమూల్యమైన చాన్స్ వదులుకుని ఆ క్రెడిట్ ప్రభుత్వానికే అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుంది. ఏ ఇష్యూను రైజ్ చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామా అని విపక్షాలన్నీ ఆలోచిస్తాయి.. కానీ చేతికి అందిన ఇలాంటి అస్త్రాన్ని మాత్రం రామచంద్రయ్య పక్కనపడేసారే అనిపిస్తోంది. ప్రజాబ్యాలెట్ లాంటి మురిగిపోయిన ఆలోచనలకు బదులుగా, ఇలాంటి క్రియాశీలమైన పనులు చేస్తే.. అప్పుడైనా.. అరే ఏపీలో కాంగ్రెస్ పార్టీ బతికే ఉందే అనైనా అనుకుంటారు జనం.