తనను అభిమానించే పేద ప్రజలకు కానుకలు ప్రకటించడంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పేరును మొదటగా చెప్పుకోవాల్సి వస్తుందేమో. అందుకే .. ఆమె కన్నుమూసిన సందర్భంలో లక్షలాది మంది జనం తరలి వచ్చి కడసారి చూపుకోసం ఎగబడ్డారు. అయితే అమ్మ జయలలిత పట్ల అవ్యాజ ప్రేమానురాగాలు ఉన్న అభిమానులు ఎంతో మంది ఆమె అనారోగ్యంగా ఉన్న వార్తలను చూసి భరించలేక, ఆమె మరణించిన సందర్భంలో అసువులు బాశారు. వారందరికీ అమ్మ తరఫున ‘అంతిమ కానుక’ అన్నట్లుగా ఒక్కొక్కరి కుటుంబానికి మూడేసి లక్షల రూపాయల వంతున ఆర్థిక సాయం అందించాలని అన్నా డీఎంకే పార్టీ నిర్ణయించింది. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు, మరణించిన తర్వాత, తమిళనాడు వ్యాప్తంగా మొత్తం 77 మంది అసువులు బాసినట్లు పార్టీ లెక్కతేల్చింది. అలాగే అమ్మ మరణవార్త విని ఆత్మాహుతికి ప్రయత్నించి గాయపడిన వ్యక్తి కుటుంబానికి, వేలు కోసుకున్న వ్యక్తి కుటుంబానికి 50 వేల వంతున ఇవ్వాలని నిర్ణయించారు.
తమిళనాట జయలలిత మీద భక్తి ప్రపత్తులు ఇంకా వెల్లువెత్తుతున్నాయి. జయలలితను ఖననం చేసిన మెరీనా బీచ్ లోని స్థలం ఇప్పుడు ఓ యాత్రాస్థలిలాగా మారిపోయింది. వేలాది మంది అమ్మ భక్తులు అక్కడకు వచ్చి జయలలిత సమాధిని దర్శించుకుని వెళుతున్నారు.
అన్నా డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, పలువురు కార్యకర్తలు అమ్మ సమాధి వద్ద శిరోముండనాలు చేయించుకున్న విషయం కూడా తెలిసిందే. అలాగే సమాధి వద్ద అనేక మంది జయలలిత అభిమానులు రోజూ వచ్చి తలనీలాలు సమర్పించి.. ఆమె సమాధికి భక్తితో పూజలు చేయించి వెళుతున్నారు.
రాజకీయంగా ఆమె మరణం పర్యవసానాలు తమిళనాట ఎలా ఉండబోతున్నాయో గానీ.. అభిమానుల ప్రపంచంలో మాత్రం ఆమె మరణం చాలా పెద్ద లోటు అని కనులముందు ససాక్ష్యంగా కనిపిస్తోంది.