అమర్త్యసేన్ నోట కూడా మైసూరా మాటలే!

Update: 2016-12-01 04:07 GMT

నోట్ల రద్దు పర్యవసానంగా ఏర్పడిన కష్టాల విషయంలో కొందరు ప్రముఖులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కష్టాలు ఎదురు కాకుండా.. ముందు చూపుతో ప్రణాళికాబద్ధంగా ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకురావడంలో కేంద్రప్రభుత్వం దారుణంగా విఫలం అయిందంటూ పలువురు విమర్శిస్తున్నారు. అయితే ప్రభుత్వాన్ని మోదీని విమర్శించడంలో ఎక్కువగా రాజకీయ విమర్శలే ఉంటున్నాయి. రాజకీయ విపక్షాలు చేస్తున్న అడ్డగోలు విమర్శలను పట్టించుకోకపోయినప్పటికీ.. తటస్థులు మేధావులు చేసే విమర్శల్ని మాత్రం పరిగణనలోకి తీసుకోవాల్సిందే.

ఇప్పుడు అంతర్జాతీయ ఆర్థికవేత్త , భారతరత్న, నోబెల్ బహుమతి గ్రహీత అయిన అమర్త్యసేన్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకులనుంచి నగదును విత్ డ్రా చేసుకోవడంపై పరిమితులు విధించడం అనేది ఆర్థిక వ్యవస్థ మూలాలనే దెబ్బతీసిన నిర్ణయంగా ఆయన అభివర్ణిస్తున్నారు. బ్యాంకు ఖాతాలకు, ఖాతాల్లోని సొమ్ములకు విలువ లేకుండా చేసేశారు. ఇది చాలా దుర్మార్గమైన నిర్ణయం అంటూ అమర్త్యసేన్ విమర్శించడం విశేషం. ‘ఐ ప్రామిస్ టూ పే’ అం టూ రిజర్వు బ్యాంకు గవర్నర్ సంతకం చేసే రూపాయి నోటు అనేది ప్రామిసరీ నోటుతో సమానం అని, దానికి విలువ ఇవ్వకపోవడం అంటే వాగ్దాన భంగం జరిగినట్లే అని అమర్త్యసేన్ అంటున్నారు.

సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం ఏ పార్టీతోను సంబంధం లేకుండా తటస్థంగా ఉన్న ఎం.వి. మైసూరా రెడ్డి కూడా అచ్చంగా ఇదే వాదనను నాలుగు రోజుల కిందట లేవనెత్తిన సంగతి పాఠకులకు గుర్తుండే ఉంటుంది. బ్యాంకుల్లో నగదు విత్ డ్రా మీద పరిమితి విధించడం.. బ్యాంకుల్లో డబ్బు లేదని చెప్పడం అంటే.. వ్యక్తులు ఐపీ పెట్టడం తో సమానం అని మైసూరా రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటూ ఆయన ఏకంగా హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి కేంద్రప్రభుత్వం హైకోర్టు ఆదేశాలమేరకు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ పిటిషన్ ఇంరా హైకోర్టు విచారణలోనే ఉంది.

ఇలాంటి నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్త అమర్త్యసేన్ కూడా ఇదే వాదన వినిపిస్తూ నిర్ణయాన్ని తప్పుపట్టడం అనేది మైసూరా పిటిషన్ లోని వాదనకు మరింత బలం చేకూర్చవచ్చు. అయితే అమర్త్యసేన్ రాజకీయ విమర్శ లాగా కాకుండా, నల్లధనం విషయంలో మోదీ విజయం సాధిస్తే ఆయనను ఆరాధించి, అభినందిస్తానంటూ పేర్కొనడం విశేషం.

Similar News