అంతా మర్చిపోండి.....

Update: 2017-03-06 05:35 GMT

రాష్ట్ర విభజన గడిచిన చరిత్ర.. నవ్యాంధ్ర అభివృద్ధిపై అందరూ దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ సర్కారు కట్టుబడి ఉందన్న ఆయన.. విభజన చట్టంలో పేర్కొన్న హామీలతో పాటు చట్టంలో పొందుపర్చిన అంశాలను కూడా చేసి చూపిస్తామని భరోసా ఇచ్చారు. జై ఆంధ్రా ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పడితే ఏపీ.. దేశంలోనే ముందు వరుసలో ఉండేదన్నారు. అపార సహజ వనరులు, భౌగోళిక వైవిధ్యమున్న ఆంధ్రప్రదేశ్‌కు మంచి భవిష్యత్తు ఉందన్నారు. గుంటూరు హిందూ కళాశాలలో స్వాతంత్య్ర సమరయోధుడు నడింపల్లి వేంకట లక్ష్మీనరసింహారావు ఆత్మకథ గ్రంధావిష్కరణకు హాజరైన వెంకయ్యనాయుడు.., మహనీయుల జీవితాలను ఈతరం స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని.. చట్టసభలు గాడి తప్పుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కులం, మతం, ప్రాంతం ధనానికి చోటు ఇవ్వరాదని.., అభ్యర్థుల గుణానికే ప్రాధాన్యమివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశాన్ని అభివృద్ది పథంలో నడిపేందుకు ప్రధాని మోదీ సంస్కరణల మార్గాన్ని అనుసరిస్తున్నారన్న కేంద్రమంత్రి... మోదీకి అన్ని వర్గాలు నైతిక మద్దతు అందించాలని కోరారు. జమ్ముకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని వెంకయ్య పునరుద్ఘాటించారు.

Similar News