జగన్ కు క్లిష్ట పరిస్థితులు తప్పవా?

జగన్ ప్రభుత్వానికి మరోసారి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కష్టాలు తప్పేట్లు లేవు.

Update: 2023-02-28 13:06 GMT

జగన్ ప్రభుత్వానికి మరోసారి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కష్టాలు తప్పేట్లు లేవు. ఉద్యోగుల రూపంలో సమస్య జగన్ ముందుకు రానుంది. ఎన్నికలు ఇంకా ఏడాది మాత్రమే ఉండటంతో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. చీఫ్ సెక్రటరీకి ఉద్యోగ సంఘాలు నోటీసులు ఇచ్చాయి. ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, ఉద్యోగులను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్ని మార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినా ప్రయోజనం లేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

చీఫ్ సెక్రటరీకి నోటీసులు...
ఉద్యోగుల నుంచి కూడా వత్తిడి తీవ్రమవుతుండటంతో ఇక ఉద్యమ బాట తప్పనిసరి పరిస్థితి అయిందన్నది ఉద్యోగ సంఘాల వాదన. తమ సహనాన్ని చేతకానితనంగా ప్రభుత్వం భావిస్తుందని అంటున్నారు. ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా నాలుగేళ్లు కాలయాపన చేసిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ఆందోళన చేయడం తప్ప మరో మార్గమేమీ కనిపించడం లేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలను కూడా చెల్లించలేదని, అదేమని అడిగితే అనేక ఆంక్షలు విధించి వేధిస్తున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు అంటున్నారు.
దశలవారీగా...
ఇప్పటికే పదకొండో పీఆర్సీని కోల్పోయామంటున్న ఉద్యోగులు అనేక రాయితీలను పోగొట్టుకుంటున్నామని ఆవేదన చెందుతున్నారు. తాము సహకరిస్తున్నా ప్రభుత్వం మాత్రం తమ గోడును పట్టించుకోక పోవడంపై ఉద్యోగులు ఆందోళనతో పాటు మండి పడుతున్నారు. ఉద్యోగులు రోడ్ల మీదకు వస్తే అది తప్పు కాదని కూడా తెలియజేశారు. మంత్రులతో అనేక సమావేశాలు జరిగినా ఒరిగిందేమీ లేదని అందుకే సమ్మె తప్ప మరొక మార్గం లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అందుకే ఉద్యమ కార్యాచరణను ప్రకటించామని బొప్పరాజు చెప్పుకొచ్చారు. ఈరోజు సీఎస్ ను కలసి వివరించామని తెలిపారు.
సమ్మె బాట పట్టనున్న...
మార్చి 9వ తేదీ నుంచి ఉద్యమ కార్యాచరణను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. దశల వారీగా తమ ఆందోళనను ఇప్పటికే ప్రకటించామని, సెల్ డౌన్, పెన్ డౌన్, భోజన విరామ సమయాల్లో నిరసనలతో తాము ఆందోళనలను ప్రారంభించనున్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ నిర్వహించే స్పందన కార్యక్రమాల్లో దరఖాస్తులు తెలియజేస్తామని,ప్పటికీ తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకూ ఇక రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు. ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి. ఎన్నికల ఏడాది కాబట్టి డిమాండ్లు నెరవేరకుండా ఉద్యోగులు దిగిరారు. ప్రస్తుతం ఉన్న క్లిష్టపరిస్థితులకు తోడు ఉద్యోగ సంఘాల నోటీసులు ప్రభుత్వాన్ని కలవర పెడతాయనడంలో సందేహం లేదు.


Tags:    

Similar News