Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతోంది

Update: 2026-03-19 03:29 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతోంది. ఉగాది పర్వదినం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలలో బారులు తీరారు. పండగ రోజు, సెలవు దినం కావడంతో పాటు శుక్రవారం సెలవు పెట్టుకుంటే వరసగా సెలవులు రావడంతో తిరుమలకు ఈ ఐదు రోజుల పాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

నేడు ఉగాది ఆస్థానం...
తిరుమలలో నేడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం జరగనుంది. ఆలయంలో బంగారు వాకిలి చెంతకు సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి రానున్నారు. మరో పల్లకిపై శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడు విష్వక్సేనుల వేంచేస్తారు. ఉత్సవమూర్తులకు నివేదనలు, పూజల తర్వాత నూతన వస్త్రాల సమర్పణ ఉంటుంది. అనంతరం తిరుమలలో సిద్ధాంతులు పంచాంగ శ్రవణం చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
పదిహేడు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదిహేడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,332 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,852 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News