బాధ.. ఆవేదన…కల్గించింది.. అయినా తప్పదు

ఇలాంటి వ్యాధులను ఈ జనరేషన్ లో చూస్తామని అనుకోలేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆయన ఏపీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమర్థవంతంగా కరోనాను [more]

Update: 2020-03-26 13:02 GMT

ఇలాంటి వ్యాధులను ఈ జనరేషన్ లో చూస్తామని అనుకోలేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆయన ఏపీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొనలేకపోతే భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి అన్నారు. క్రమశిక్షణతోనే కరోనాను గెలవగలుగుతామన్నది వాస్తవమన్నారు. నిర్లక్ష్యం వహిస్తూ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇతర దేశాలను చూస్తే తెలుస్తుందని జగన్ అన్నారు. కొన్ని నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకుంటే ఆ తర్వాత మరింత దిగజారిపోతుందని అన్నారు. కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని జగన్ అన్నారు.

తనకు బాధ కల్గించాయన్న……

నిన్న రాత్రి కొన్ని ఘటనలు తనకు ఆందోళన కల్గించాయని జగన్ అన్నారు. తెలంగాణ నుంచి చాలా మంది ఏపీ వాసులు రాష్ట్రంలోకి రావడానికి ప్రయత్నించారన్నారు. మనవాళ్లను కూడా మనం చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి లేదా? అని తాను బాధపడ్డానన్నారు. కొంచెం కష్టమైనా అందరూ సహకరించాలని జగన్ కోరారు. ఎవరి ఇళ్లకు వారు పరిమితమవ్వకపోతే కరోనాను కట్టడి చేయలేమని జగన్ అభిప్రాయపడ్డారు. ఈరోజు కూడా ఏపీ బోర్డర్ లో అనేక మంది రాష్ట్రంలోకి వచ్చేందుకు ప్రయత్నించారన్నారు. ఎవరూ రాష్ట్రంలోకి వచ్చే ప్రయత్నం చేయవద్దని జగన్ విజ్ఞప్తి చేశారు. ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉంటే వైరస్ ను నియంత్రించవచ్చని జగన్ తెలిపారు.

కేసీఆర్ సానుకూలంగా……

ఏప్రిల్ 14వ తేదీ వరకూ ఇళ్లకే పరిమితమవ్వాలని జగన్ సూచించారు. లేకుంటే కాంట్రాక్ట్ ట్రేసింగ్ కష్టం అవుతుందన్నారు. ఏపీలో జిల్లాల నుంచి జిల్లాలకు కూడా ప్రయాణించవద్దని జగన్ అభ్యర్థించారు. కేసీఆర్ కూడా సానుకూలంగానే స్పందించారని చెప్పారు. అక్కడ సమస్య ఉంటే అక్కడి ప్రభుత్వమే పరిష్కరిస్తుందని జగన్ చెప్పారు. కేసీఆర్ ఏపీ వాసులను తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారని జగన్ తెలిపారు. అక్కడ షెల్టర్ , ఫుడ్ కు ఇబ్బంది లేదని జగన్ తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో పది కేసులు మాత్రమే పాజిటివ్ గా తేలాయని చెప్పారు. ఇవి పెరగకుండా చూసుకోవడం అందరి బాధ్యత అని జగన్ గుర్తు చేశారు.

క్రమశిక్షణతోనే కట్టడి….

విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వాళ్లను ట్రాక్ చేస్తే 27,819 మంది వచ్చారన్నారు. వీరందరిపై నిఘా పెట్టామని జగన్ చెప్పారు. గ్రామ వాలంటీర్లను, గ్రామ సచివాలయ సిబ్బంది, ఆశావర్కర్లను జగన్ అభినందించారు. ఏపీలో నాలుగుచోట్ల క్రిటికల్ కేర్ ఆసుపత్రులను ఏర్పాటు చేశామని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతిలో ఏర్పాటు చేశామని చెప్పారు. 80.9 శాతం మంది కరోనా సోకినా బయటపడ్డారని, ఇళ్లల్లో ఉండే వీరికి నెగిటివ్ వచ్చిందన్నారు. కేవలం 14శాతం మాత్రమే హాస్పిటల్ లో చేరుతున్నారని చెప్పారు. మూడు వారాల పాటు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అధికారులు అందరితో సమన్వయం చేసుకుని వెళతారన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా 1902కు ఫోన్ చేస్తే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందన్నారు. నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూస్తామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగన్ తెలిపారు.

Tags:    

Similar News