చంద్రబాబుపై విసుర్లు

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నానని, చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో ఇల్లు కట్టారని జగన్ అన్నారు

Update: 2023-05-16 07:23 GMT

తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నానని, చంద్రబాబు మాత్రం ప్రతిపక్ష నేతగా హైదరాబాద్‌లో ఇల్లు కట్టారని జగన్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కొద్దిసేపటి క్రితం బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించారు. వైఎస్సార్ మత్స్యాకార భరోసా నిధులను విడుదల చేశారు. ఈ నిధులను 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు విడుదల చేశారు. మొత్తం 231 కోట్ల రూపాయల నిధులను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు.

ఎన్ని వ్యవస్థలను...
తనపై ఎన్ని వ్యవస్థలను ప్రయోగించినా పదిహేనేళ్ల నుంచి రాజీ పడలేదని జగన్ ఈ సందర్భంగా అన్నారు. ప్రధానిని మోదీని తాను కలిస్తే చాలు అసత్య ప్రచారాలకు దిగుతారన్నారు. పొత్తులు పెట్టుకునేది వీళ్లే. తెగదెంపులు చేసుకునేది వీళ్లేనని ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడు ఆరు నెలలకు ఒకసారి రెండు సినిమాల షూటింగ్‌ మధ్య గ్యాప్ లో వచ్చి చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లపోతారని ఎద్దేవా చేశారు.
ప్రధానులను చేసిన పెద్దమనిషి...
చంద్రబాబు పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రి గా ఉన్నా ఆయన పేరు చెబితే ఒక్క పేరు అయినా గుర్తుకు వస్తుందా? అని జగన్ ప్రశ్నించారు. 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదన్న జగన్ తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్‌పై ఉందని అన్నారు. ప్రధానులను, రాష్ట్రపతులను తానే చేశానని గొప్పలు చెప్పుకునే పెద్దమనిషి ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారని నిలదీశారు. మీ ఇంట మంచి జరిగితేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరోసారి అధికారం ఇవ్వండని జగన్ కోరారు.


Tags:    

Similar News