Andhra Pradesh : పెరుగుతున్న స్థానాలతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
ఆంధ్ర్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది.
ఆంధ్ర్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ మేరకు ఎన్డీఏ పక్షాల నేతల సమావేశంలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలకు గాను 263 స్థానాలకు పెరగనున్నాయి. ఇక లోక్ సభ స్థానాలకు వచ్చే సరికి ఇరవై ఐదు నుంచి 38 స్థానాలకు చేరతాయి. అంటే కొత్తగా వందమందికి పైగా పదవులు కొత్తగా లభించనున్నాయి.
కూటమి అంచనాలివే...
అయితే పెరుగుతున్న స్థానాలతో ఎవరికి లాభం?ఎవరికి నష్టం అన్న అంచనాలు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమయ్యాయి. కూటమికి లాభమని మూడు పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుండటంతో పోలింగ్ కూడా ఎక్కువగా అవుతుందని, తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఓటేస్తారని అంటున్నారు. అంతే కాదు నియోజకవర్గాల సంఖ్య పెరిగినప్పుడు కూటమిని అభిమానించే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
వైసీపీ ఆశలివే...
మరొకవైపు వైసీపీ కూడా నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరగడంతో తమకు ప్రయోజనమని అంటున్నారు. అధికార పార్టీపై వ్యతిరేకతతో ప్రజలు ఇప్పటికే కూటమి పాలన పట్ల విముఖతగా ఉన్నారని, ఈసారి 263 స్థానాలయితే మ్యాజిక్ ఫిగర్ 181 మ్యాజిక్ ఫిగర్ అని అంటున్నారు. ఈ మ్యాజిక్ ఫిగర్ ను తాము చేరుకోవడం సులువేనని అంటున్నారు. 2019 ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేసి యాభై శాతం ఓటు బ్యాంకుతో 151 స్థానాలను గెలుచుకున్నామని, ఈసారి రెండు వందలకు పైగానే గెలుచుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో తమకు నలభై శాతం ఓటు బ్యాంకు వచ్చిందని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడంతో ఆశావహులు కూడా పెరుగుతున్నారని, దీంతో తమ పార్టీకి నియోజకవర్గాల సంఖ్య పెంపుదల ప్రయోజనమేనని అంటున్నారు.