Andhra Pradesh : చేరికల జోరుతో గ్లాస్ పార్టీని పట్టుకోలేమటగా?
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. దీంతో జనసేనలో చేరే వారి సంఖ్య రానున్న కాలంలో పెరుగుతుందని అంటున్నారు. ఇప్పటి వరకూ పదవులు దక్కలేదని కొంత అటు ఇటుగా ఉన్న నేతలు ఇక క్యూ కట్టే అవకాశముందని అంటున్నారు. జనసేనలో ప్రస్తుతం పదవులు దక్కలేదని చాలా మంది అసంతృప్తిలో ఉన్నారు. నామినేటెడ్ పదవులు ఆశించి కూడా భంగపడిన వారు నియోజకవర్గాల్లో అనేక మంది నేతలున్నారు. దీంతో చాలా మంది నిరాశలో ఉన్నారు. అందుకే రెండేళ్లవుతున్నా పెద్దగా జనసేనలో చేరికలు లేవు. విజయవాడలో జరిగే సమావేశంలోనూ పార్టీని బలోపేతం చేయడంతో పాటు నియోజకవర్గాల పెంపుపై నేడు పవన్ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశముంది.
111 పదవులు అత్యధికంగా...
కానీ రానున్న ఎన్నికల్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుండటంతో తమకు పదవులు వస్తాయని, ఎమ్మెల్యేనో, ఎంపీనో అవుతామని చెప్పి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలకు గాను 263 స్థానాలకు పెరగనున్నాయి. ఇక లోక్ సభ స్థానాలకు వచ్చే సరికి ఇరవై ఐదు నుంచి 38 స్థానాలకు చేరతాయి. దాదాపు 111 మందికి అత్యధికంగా అదనంగా పదవులు వస్తుండటంతో ఖచ్చింతగా ద్వితీయ శ్రేణి నేతల్లో ఇక జోష్ పెరుగుతుందని అంచనాల్లో జనసేన నేతలున్నారు.
సీట్ల సంఖ్య పెరుగుతుండటంతో...
కూటమిలో పొత్తులో భాగంగా సీట్ల సంఖ్య కూడా మిత్రపక్షాలకు పెరిగే అవకాశముంది. జనసేన గత ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పోటీ చేసింది. రెండు పార్లమెంటు స్థానాల్లోనే బరిలోకి దిగింది. పోటీ చసిన అన్నిస్థానాల్లో గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ ను సాధించింది. 88 అసెంబ్లీ స్థానాలు, 23పార్లమెంటు స్థానాలు పెరగనుండటంతో టీడీపీ అత్యధిక స్థానాల్లో పోటీ చేసినప్పటికీ జనసేన ఈసారి అరవై నుంచి డెబ్భయి వరకూ అసెంబ్లీ స్థానాల్లోనూ పది వరకూ పార్లమెంటు స్థానాల్లోనూ పోటీ చేసే అవకాశముందని భావిస్తున్నారు. అందుకే ఇక జనసేనలో చేరికలు జోరుగా ఉంటాయని, సరైన నేతలను ఎంపిక చేసుకుని నాయకత్వ బాధ్యతలను అప్పగించే యోచనలో జనసేన నాయకత్వం ఉంది.