ఆమంచి వైసీపీకి దూరమవుతారా?

ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా తాజాగా జగన్ నియమించారు.

Update: 2022-12-22 07:30 GMT

చూస్తుంటే చీరాల వైసీపీ అధినేత జగన్ కు తలనొప్పిగా మారేటట్లుంది. రాను రాను అక్కడ రాజకీయ ఇబ్బందులు ఎక్కువవుతున్నాయే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. పార్టీ హైకమాండ్ ఎవరినీ కాదనలేని పరిస్థితి. మూడు గ్రూపులుండటంతో క్యాడర్ మాత్రం అయోమయంగా ఉంది. కానీ నేతల వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. పార్టీ అధినాయకత్వాన్ని కూడా పెద్దగా నేతలు పట్టించుకోవడం లేదు. ఎవరికి వారే వచ్చే ఎన్నికల్లో చీరాల టిక్కెట్ తమదేనని చెప్పుకోవడం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే విధంగా ఉందన్నది వాస్తవం.

ముగ్గురు మధ్య...
చీరాల అంటే సహజంగా ఆమంచి కృష్ణమోహన్ గుర్తుకొస్తారు. 2009లో ఆమంచి కృష్ణమోహన్ చీరాల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2014లో రాష్ట్ర విభజన జరగడంతో ఆయన సొంతంగా నవోదయం పార్టీని పెట్టుకుని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ లో చేరిన ఆమంచి కృష్ణమోహన్ ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీ మద్దతుదారుగా మారారు. అప్పటి నుంచే చీరాల వైసీపీలో ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమయింది.

పోతుల సునీతది మరో వర్గం...
దీంతో పాటు అక్కడ ఎమ్మెల్సీగా పోతుల సునీత ఉన్నారు. టీడీపీ నుంచి వచ్చిన సునీతకు మరోసారి ఎమ్మెల్సీగా జగన్ అవకాశమిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను చీరాల నుంచి వైసీపీ తరుపున పోటీ చేస్తానని కరణం వెంకటేష్ ప్రకటించుకున్నారు. కరణం బలరాం రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకుని కుమారుడిని ఎమ్మెల్యేగా చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. ఈ ముగ్గురు వేర్వేరుగా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ముగ్గురు విడివిడిగా కార్యక్రమాలు జరుపుతుండటంతో పార్టీకి ఇబ్బందికరంగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు.
పర్చూరు ఇన్ఛార్జిగా...
ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా తాజాగా జగన్ నియమించారు. పర్చూరు నియోజకవర్గంగా ఆమంచి కృష్ణమోహన్ ను నియమిస్తున్నట్లు జగన్ తెలిపారు. పర్చూరుకు సంబంధించి ఏ విషయమైనా ఆమంచితో కలసి రావాలని జగన్ తెలిపారు. రామనాధం బాబును ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించవద్దంటూ కొందరు కోరగా జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. పర్చూరు ఇన్ఛార్జిగా వెళ్లేందుకు ఆమంచి సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలిసింది. తనకు చీరాలలోనే పట్టు ఉందని, అక్కడే తాను పోటీ చేస్తానని సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా చీరాలలోనే పోటీ చేస్తాను తప్పించి పర్చూరుకు వెళ్లనని ఆయన అంటున్నట్లు తెలిసింది.

టిక్కెట్ దక్కకుంటే...
చీరాలలో సామాజికవర్గాల పరంగా పద్మశాలి, బలిజ సామాజికవర్గం ఎక్కువగా ఉంటుంది. రెండు సామాజికవర్గాలు ఎవరి వైపు మొగ్గు చూపితే వారు గెలిచేందుకు అవకాశం ఉంటుంది. అందరూ కలసి పనిచేస్తే వైసీపీదే విజయం. కానీ టిక్కెట్ ఎవరికి దక్కుతుందన్నది చివరి నిమిషంలో కాని జగన్ పార్టీ అధినాయకత్వం తేల్చదు. ఆమంచి కృష్ణమోహన్ తనకు చీరాల టిక్కెట్ దక్కకపోతే అవసరమైతే పార్టీని వీడేందుకు కూడా వెనకాడరని ఆయన సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. మరో వైపు మొన్నటి వరకూ కరణం వెంకటేష్ అద్దంకి నుంచి పోటీ చేస్తారని భావించినా ఆయన చీరాల నుంచే బరిలోకి దిగుతానంటున్నారు. మొత్తం మీద చీరాల నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక జగన్ కు రానున్న రోజుల్లో తలనొప్పిగా మారుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.


Tags:    

Similar News