మధ్యతరగతికి ఊరట.. ఆ నిర్ణయాలు తీసుకుంటే?

తొమ్మిది రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఉండటంతో వచ్చే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది

Update: 2023-01-20 07:23 GMT

తొమ్మిది రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఉండటంతో వచ్చే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ఐదో సారి ప్రవేశపెట్టబోతున్నారు. అయితే తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించి అనేక ప్రయోజనాలు ఉండే అవకాశముందని తెలుస్తోంది. మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ ఎన్నికలు జరగనున్నాయి.

తొమ్మిది రాష్ట్రాలకు...
ఈ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండే అవకాశముందని తెలిసింది. అయితే ఏ యే రాష్ట్రాలకు ఎటువంటి ప్రయోజనాలను అందించాలన్న దానిపై ఇప్పటికే కసరత్తులను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు ఈ తొమ్మిది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అనేక హామీలను గుప్పిస్తున్నారు. వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలను చేస్తున్నారు.
ఆదాయపు పన్ను...
అయితే దీంతోపాటు కొన్ని కీలక నిర్ణయాలను బడ్జెట్ లో తీసుకునే అవకాశముంది. ప్రధానంగా మధ్యతరగతిని ఆకట్టుకునే విధంగా నిర్మలమ్మ బడ్జెట్ లో కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయని తెలిసింది. పన్ను మినహాయింపు ఇందులో ఒకటిగా కనిపిస్తుంది. సీనియర్ సిటిజన్లతో పాటు పింఛన్లు తీసుకునే వారికి పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు లభించే అవకాశముందని తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే విధంగా పన్ను మినహాయింపులు ఉండబోతున్నాయని హస్తిన వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ధరల పెంపుదలపై...
మరోవైపు రైల్వే ప్రయాణంలో సీనియర్ సిటిజన్‌లకు రాయితీలను కూడా కల్పించేందుకు నిర్ణయం తీసుకోబోతున్నారని తెలిసింది. కరోనా తర్వాత రైల్వేలకు నష్టం వస్తుందని సీనియర్ సిటిజన్లకు రాయితీలను రైల్వే శాఖ ఎత్తివేసింది. దానిపై పునరాలోచన చేయబోతున్నట్లు సమాచారం. అలాగే కరోనా తర్వాత కొన్ని వస్తువుల ధరలు పెరిగాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్థం తర్వాత పామాయిల్ ధరలు కూడా పెరిగాయి. పెట్రోలు ధరలు ఈ మధ్య కాలంలో నిలకడగా కొనసాగుతున్నాయి. గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. వీటిపై ఆలోచన చేసే అవకాశముందని తెలిసింది.


Tags:    

Similar News