కన్నా చేరికతో వాళ్లిద్దరి భవిష్యత్..?

కన్నాలక్ష్మీనారాయణ టీడీపీలో చేరడంతో ఆయన సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది

Update: 2023-02-27 04:48 GMT

ఒక్కోసారి అంతే. రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి రావడానికి తీసుకునే నిర్ణయాలు కొందరి రాజకీయ భవిష్యత్ కు ఇబ్బందిగా మారుతుంటాయి. ఇప్పుడు గుంటూరు జిల్లాలోనూ అదే జరుగుతుంది. సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. అట్టహాసంగా గుంటూరు నుంచి బయలుదేరి వెళ్లి ఆయన చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఇప్పుడు చంద్రబాబుకు కన్నా అవసరం ఎంతో ఉంది. అలాగే పదేళ్లుగా రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న కన్నాకు కూడా సైకిల్ సవారీ అంతే అవసరం. అందుకని ఇద్దరిలో ఎవరినీ తప్పు పట్టడానికి వీలులేదు.


కొందరి నేతలకు...

అయితే ఇప్పుడు వచ్చిన చిక్కల్లా గుంటూరు జిల్లాలో కొందరి నేతలకే. అదీ కొందరి రాజకీయ భవిష‌్యత్ ఇబ్బందుల్లో పడనుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు పశ్చిమ లేదా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం మొన్నటి వరకూ జరిగింది. కానీ అందులో నిజం లేదంటున్నారు. ఆ రెండు చోట్ల టీడీపీకి బలమైన అభ్యర్థులే ఉన్నారు. అక్కడ కన్నా లక్ష్మీనారాయణను పోటీకి దింపే అవకాశం లేదు. చంద్రబాబు కూడా ఆ ఆలోచన చేయడం లేదని చెబుతున్నారు. కన్నాను సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలన్న నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పెదకూరపాడు, పశ్చిమ అయితే సీనియర్ నేతలు ఇబ్బంది పడతారు. సత్తెనపల్లి అయితే ఎవరికీ ఇబ్బంది ఉండదని, యువనేతలను పక్కన పెట్టినా పెద్దగా ఇబ్బంది ఉండదన్న లెక్కలు వేశారట టీడీపీ అధినేత.
మూడు వర్గాలుగా...
సత్తెనపల్లిలో టీడీపీ మూడు వర్గాలుగా విడిపోయి ఉంది. అక్కడ పార్టీకి ఓటు బ్యాంకు ఉన్నా సరైన నేతలు లేకపోవడం, గ్రూపులుగా విడిపోవడంతో అక్కడ అవకాశాలు నిన్నటి వరకూ కష్టంగానే కనిపించాయి. అందుకే చంద్రబాబు సత్తెనపల్లికి ఎవరినీ ఇన్‌ఛార్జిగా ఇంతవరకూ నియమించలేదు. కోడెల శివప్రసాద్ తనయుడు శివరామ్ పై వ్యతిరేకత ఉంది. కోడెల వ్యతిరేక వర్గం శివరామ్ కు టిక్కెట్ ఇస్తే తాము సహకరించబోమని తెగేసి చెబుతుంది. మరోవైపు రాయపాటి సాంబశివరావు తనయుడు కూడా అదే నియోజకవర్గాన్ని ఆశిస్తున్నారు. కానీ అక్కడకు రాయపాటి కుటుంబాన్ని పంపే ఇష్టంలేని చంద్రబాబు నాలుగేళ్ల నుంచి నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.

జనసేన కూడా...
కానీ ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ రాకతో సత్తెనపల్లి సమస్య తీరిందనే చెబుతున్నారు. జనసేనతో పొత్తు ఉంటే సత్తెనపల్లిని ఆ పార్టీకి వదిలేయాలని తొలుత చంద్రబాబు భావించారంటారు. కానీ ఇప్పుడు కన్నా రాకతో ఆయనకు సత్తెనపల్లి సరైన ప్లేస్ అని భావిస్తున్నారు. కన్నా అయితే ఖచ్చితంగా అంబటిని ఓడించి మరోసారి టీడీపీ జెండాను సత్తెనపల్లిలో ఎగురవేసే అవకాశం ఉంటుందన్న అంచనాలో ఉన్నారు. కన్నాకు సత్తెనపల్లి సీటు రిజర్వ్ చేస్తే జనసేన కూడా పొత్తులో భాగంగా పట్టుబట్టే అవకాశం ఉండదన్నది చంద్రబాబు వ్యూహం. అందుకే సత్తెనపల్లి సీటునే కన్నా లక్ష్మీనారాయణకు ఆఫర్ చేస్తారని అంటున్నారు. మొత్తం మీద కన్నా రాకతో కోడెల శివరాం, రాయపాటి రంగారావు రాజకీయ భవిష్యత్ ఇబ్బందుల్లో పడినట్లేనని అంటున్నారు.


Tags:    

Similar News