జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఏం చేయాలి? కేంద్రం మార్గాలేమిటి?

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు..

Update: 2023-09-04 05:37 GMT

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు ఇటీవల కేంద్ర ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జమిలి ఎన్నికల విధానం తెరపైకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అధికార పక్షం తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే చర్చ జోరందుకుంది. ఈ ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11న ముగిశాయి. అయితే, మళ్లీ అకస్మాత్తుగా ఈ పార్లమెంటు 'ప్రత్యేక సమావేశాలను' ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటూ అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లో మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వచ్చే ఏడాది మే-జూన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంఓ 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' (జమిలి ఎన్నికలు) అనే అంశం తలెత్తింది. ఐదు రోజుల ప్రత్యేక సమావేశాల్లో కొన్ని ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టవచ్చని, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలు కూడా ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఏం చేయాలి?

అయితే జమిలి ఎన్నికలు నిర్వహణ అమలు చేయాలంటే అంతా సులభమైన పని కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు చాలా ప్రాసెస్‌ ఉంటుందని అంటున్నారు. 'రాజ్యాంగంలో అనేక సవరణలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాల నుంచి సమ్మతి తీసుకోవాలి. రాష్ట్ర అసెంబ్లీలను రద్దు చేయాల్సి ఉంటుంది. ఇలా రకరకాల విధానాల ద్వారా అంతా పూర్తయిన తర్వాతే అమలు చేయడం సాధ్యమవుతుందని అంటున్నారు. అలాగే ఈ అంశం ఇంతకుముందూ లేవనెత్తారు. రాజ్యాంగ సవరణ ద్వారానే ఇది సాధ్యమవుతుందని అని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు. మరోవైపు 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' సాధ్యమేనని, అన్ని అసెంబ్లీలను రద్దు చేయాల్సిన అవసరం లేదని సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజ్యాంగాన్ని సవరించాలంటే ఉభయ సభలలో మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి. ప్రభుత్వానికి లోక్‌సభలో మెజారిటీ ఉంది. రాజ్యసభలో మెజారిటీకి ప్రయత్నించవచ్చంటున్నారు.

అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు చేస్తాయా 

ఇందులో భాగంగా 14 రాష్ట్రాల ఆమోదం కూడా తప్పనిసరి ఉండాలి. బీజేపీ దాని మిత్రపక్షాలకు 12 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ లాంటి రెండు-మూడు రాష్ట్రాలు కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయి అంటున్నారు. లోక్‌సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి జమిలీ ఎన్నికలు సాధ్యమే. అయితే, రాజ్యసభకు ఇది సమస్య కావచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వకపోతే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం కూడా కష్టమేనంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పరిగణనలోకి తీసుకున్నా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు చేస్తాయా అనే సందేహం ఉండే అవకాశం ఉంది. ఇంతకుముందు ఈ విషయంలో రెండు ప్రతిపాదనలు వచ్చాయి. రెండు దశల్లో ఎన్నికలు జరపడం మొదటిది. దీనిలో భాగంగా లోక్‌సభ ఎన్నికలకు కొన్నినెలల ముందు, తరువాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం. రెండోది బీజేపీ దాని మిత్రపక్షాల రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలను వాటంతటవే రద్దు చేయడం. అనంతరం మిగిలిన రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రం రద్దు చేయడం. కానీ ఇందులో న్యాయపరమైన చిక్కులున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అన్ని చోట్ల ఒకేసారి  ఎన్నికలు నిర్వహిస్తే సమస్య ఏమిటి?

జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయం కుదిరితే దానికి వనరులు ఏర్పాటుచేయడం సవాలుతో కూడుకున్నదనే చెప్పాలి. అన్నిచోట్లా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలంటే చాలా కష్టతరమైన అంశం. ఎందుకంటే ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఈవీఎంలు ఏర్పాటు చేయడం, అలాగే వీవీప్యాట్ యంత్రాలు, భద్రతా కూడా పెద్ద ఎత్తున అవసరం ఉంటుంది. వీటన్నింటిని నిర్వహించడం కొంత సవాలుతో కూడుకున్నది. అందుకే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కొంత కష్టంతో కూడుకున్న పని. కొన్ని ఎన్నికలు జరిగే ప్రాంతాలు చాలా సున్నితంగా ఉంటాయి. రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ఈ ఎన్నికల వల్ల లాభం ఎవరికి..?

ఈ జమిలి ఎన్నికలు నిర్వహించడం ఎవరి లాభం..? ఈ జమిలి ఎన్నికల అంశం ఈనాటికి కాదని, ఈ జమిలి ఎన్నికలు నిర్వహించాలని 1983లోనే ప్రారంభమైందని సీనియర్‌ రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అప్పట్లో ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనను అప్పట్లో ఇందిరాగాంధీ ఈ ప్రతిపాదన తిరస్కరించారని వారు గుర్తు చేస్తున్నారు. నరేంద్రమోదీ ప్రధాని అయినప్పటి నుంచి బీజేపీ ఈ జమిలి ఎన్నికల అంశాన్ని లేవనెత్తుతూనే ఉంది. పార్టీ 2014 మేనిఫెస్టోలో కూడా ఈ ప్రస్తావన ఉంది. ఎన్నికలలో నల్లధనం పెద్దఎత్తున ఉపయోగిస్తున్నారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే అది గణనీయంగా తగ్గుతుందనేది బీజేపీ అభిప్రాయం. ఎన్నికల ఖర్చుల భారం కూడా తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది. పార్టీలు, అభ్యర్థులపై ఖర్చు తగ్గుతుందని సీనియర్‌ రాజకీయ వేత్తలు చెబుతున్నారు.

ఎన్నికలు వచ్చాయంటే చాలు వాటి నిర్వహణ ఖర్చులే అతిపెద్ద భారం. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పార్టీలు లాభపడతాయి. ఎందుకంటే అవి అసెంబ్లీకి, లోక్‌సభకు వేర్వేరుగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉండద, ఇతర పార్టీలు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ జమిలి ఎన్నికలు నిర్వహించడం వల్ల పెద్ద పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీలకు లాభం చేకూరుతుందని మరి కొంత మంది వాదిస్తున్నారు. చిన్న పార్టీలకు అనేక రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం కొంత కష్టంగా మారవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జమిలి ఎన్నికలు ఏ దేశాల్లో జరుగుతున్నాయి?

జమిలి ఎన్నికలు కొన్ని దేశాల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు భారతదేశంలో ఈ జమిలి ఎన్నికల విధానం అమలు అయితే ఆ జాబితాలో కూడా భారత్‌ చేరుతుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికలు జరిగే దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా, బెల్జియం, స్వీడన్ దేశాలు జమిలి ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. కానీ జనాభా పరంగా ఇవి భారత్‌ కంటే చాలా చిన్న దేశాలు. పొరుగు దేశం నేపాల్‌కు కూడా జమిలి ఎన్నికలు నిర్వహించిన అనుభవం కూడా ఉంది. అక్కడ 2015లో కొత్త రాజ్యాంగం ఆమోదం పొందినపుడు 2017 ఆగస్టులో ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి.

Tags:    

Similar News