తెలంగాణ ఎన్నికలపై అమిత్‌ షా మాస్టార్‌ ప్లాన్‌ ఏంటి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి..

Update: 2023-08-28 05:04 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది వివిధ పార్టీలు తమ పంథాలను మార్చుకుంటున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు తమతమ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీ 115 మందితో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసేసింది. ఇప్పుడు కాంగ్రెస్‌, బీజేపీలు కూడా తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ స్థాయి నేతలు, ఢిల్లీ పెద్దలు తెలంగాణకు వచ్చి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాయి. శనివారం చేవెళ్లలో 'ప్రజా గర్జన' పేరిట జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని పిలిపించి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేయించింది.

ఇక మరుసటి రోజున ఖమ్మంలో 'రైతు ఘోష- బీజేపీ భరోసా' పేరుతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రప్పించి భారీ బహిరంగ సభను నిర్వహించారు. అయితే అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ పార్టీల టార్గెట్ ఏంటంటే కేసీఆర్‌ను ముచ్చటగా మూడోసారి సీఎం కాకుండా చేయడమే. ఇందుకు చిన్నపాటి అవకాశం వచ్చినా సరే దాన్ని అద్భుతమైన అవకాశంగా మలుచుకుని ప్రతిపక్షాలు ముందుకెళ్తున్నాయి. ఖమ్మం పర్యటన తర్వాత బీజేపీ కోర్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి? బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఎలా ఎదుర్కొవాలి? ఇలాంటి రకరకాల మాస్టార్‌ ప్లాన్‌లతో రాష్ట్ర నేతలకు అమిత్‌ షా దిశానిర్ధేశం చేశారు.

బీజేపీ కోర్‌ కమిటిలో మాస్లార్‌ ప్లాన్‌..

వచ్చే ఎన్నికల్లో రాజకీయ పరిస్థితులపై ఆదివారం బీజేపీ కోర్‌ కమిటి సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను అమిత్‌ షా అడిగి తెలుసుకున్నారట. అనంతరం మాస్టర్ ప్లాన్‌ ఇచ్చి దీని ప్రకారం ఎన్నికల రంగంలోకి దిగాలని నేతలకు సూచించారు. ముఖ్యంగా తెలంగాణలోని అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఎలా ముందుకెళ్లాలి? బీజేపీకి బలమున్న స్థానాలు ఎన్ని..? బలమున్న ఎమ్మెల్యేల స్థానాలు ఎన్ని..? ఎంపీ స్థానాలు ఎన్ని...? ఏ జిల్లాలో ఎన్ని స్థానాల్లో మన అభ్యర్థులు గెలుస్తారు. ఏ నియోజకవర్గాల్లో రెండవ స్థానంలో ఉంటాం..? అని బీజేపీ నేతలను అమిత్ షా అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అధిష్ఠానం నుంచి కావాల్సిన సహకారంపై అమిత్‌ షా పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇకపై ప్రతి పదిరోజులకోసారి ఢిల్లీ నుంచి ఒకసారి వస్తానని నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది.

వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, అందుకు అనుగుణంగా నేతలు జాగ్రత్తగా ముందుకెళ్లాలని అమిత్‌ షా సూచించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలకు గాలం వేయాలని, మజ్లిస్, బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగడలపై దృష్టి సారించడం ముఖ్యమన్నారు. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలపై దృష్టి పెట్టాలని, వాటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే కేంద్రం ఇచ్చిన నిధులేంటి? తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది..? కేంద్రం నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందాయి..? వంటి అంశాలను ప్రజలకు వివరించాలి. బీఆర్‌ఎస్‌ వల్ల ప్రజలకు ఒరిగిందేంటి? వంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా ముఖ్యమన్నారు. పార్టీలో నేతలు మధ్య అధిపత్య పోరు, గ్రూపులు, విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా కేసీఆర్‌పై గెలుపు కోసం పోరాటం చేయండి.. నేతలంతా వివాదాల జోలికి వెళ్లండా ఐక్యంగా కలిసి పని చేయాలి అంటూ నేతలకు సూచించారు షా.

Tags:    

Similar News