లాక్ డౌన్ దిశగా పశ్చిమ బెంగాల్.. అన్నీ బంద్ !

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. లాక్ డౌన్ ను తలపించేలా కఠిన ఆంక్షలను అమలుచేసింది. సోమవారం నుంచి అక్కడి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు,

Update: 2022-01-03 11:39 GMT

దేశంలో కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. లాక్ డౌన్ ను తలపించేలా కఠిన ఆంక్షలను అమలుచేసింది. సోమవారం నుంచి అక్కడి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూపార్క్ లను మూసివేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి హెచ్. కె. ద్వివేది నూతన మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ ఆంక్షల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఇక ఉద్యోగుల విషయానికొస్తే.. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు 50 శాతం ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సమావేశాలు వర్చువల్ గా నిర్వహించాలని సూచించారు. కోర్టులు సైతం ప్రత్యక్ష విచారణలను నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. అత్యవసరమైన కేసులు తప్ప.. మిగతా విచారణలన్నీ వర్చువల్ గానే జరుగుతాయని తెలిపాయి. ఇదిలా ఉండగా జనవరి 5వ తేదీ నుంచి విమానాల రాకపోకలపై కూడా బెంగాల్ ప్రభుత్వం ఆంక్షలు విధించనుంది. ఢిల్లీ, ముంబై లకు వారానికి రెండ్రోజులు మాత్రమే రాకపోకలు నిర్వహించేలా చర్యలు చేపట్టనుంది. అలాగే లోకల్ ట్రైన్లు కూడా 50 శాతం ప్రయాణికులతో రాత్రి 7 గంటల వరకే నడిచేటట్లు ఆదేశాలిచ్చింది.







Tags:    

Similar News