బంగాళాఖాతంలో అల్పపీడనం .. భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని ఈ అల్పపీడనం కేంద్రీకృతమైంది. తెలంగాణ ..

Update: 2023-09-06 01:39 GMT

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని ఈ అల్పపీడనం కేంద్రీకృతమైంది. తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. భూపాలపల్లి, ములుగు, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఇక నల్గొండ జిల్లా, మహబూబాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఈ జిల్లా్ల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

అల్పపీడనం ప్రభావంతో ఏపీలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం, ఏలూరు, అల్లూరి, ఎన్టీఆర్‌ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేయగా.. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, పార్వతీపురం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, పుట్టపర్తి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ.

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షాలు..

హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. నిన్న కురిసిన భారీ వర్షానికి జన జీవనం స్తంభించిపోయింది. లంగర్ హౌస్, అహ్మద్ నగర్ కాలనీ వాసులు నరకం చూస్తున్నారు. ఇళ్లలోకి వాన నీరు రావడంతో జనాలు రాత్రంతా జాగారాలు చేయాల్సి వచ్చింది. భారీ వర్షాల కారణంగా మూసీకి వరద పోటెత్తింది.

మూసికి వరద ముప్పు..

మూసికి వరద ముప్పు పొంచివున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూసారాంబాగ్ బ్రిడ్జ్‌పై రాకపోకలను నిలిపివేశారు పోలీసులు. బ్రిడ్జిపైకి వాహనాలను అనుమతించడం లేదు. చాదర్‌ఘాట్ కాజ్ వే వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కాజ్ వే వంతెనను మూసివేశారు. వరద ఉధృతి పెరగడంతో ఈ రెండు బ్రిడ్జిలను తాత్కాలికంగా మూసివేశారు. దాంతో రాత్రంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు వాహనదారులు.

Tags:    

Similar News