తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాలు..: వాతావరణ శాఖ

Update: 2023-08-31 06:08 GMT

వర్షాలు మళ్లీ మొదలు కానున్నాయి. ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో అయితే ప్రస్తుతం వర్షాలు పడుతున్నప్పటికీ.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు కొనసాగుతున్నాయి. ఇటీవల భారీ వర్షాలు కురిసి ఒక్కసారిగా వర్షాల జాడ లేకుండా పోయింది. కానీ రానున్న రోజుల్లో పరిస్థితులు మారనున్నాయని చెబుతున్నారు వాతావరణ శాఖ నిపుణులు. సెప్టెంబర్ మొదటి వారంలో మళ్లీ వర్షాలు భారీగా కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది.

రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. వాయువ్య దిశ నుంచి పొడి గాలులు తీస్తున్నాయి. దీంతో దక్షిణ భారతదేశమంతా పొడి వాతావరణం కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు ద్రోణి కూడా బంగాళాఖాతం ఉత్తరం వైపు పైకి ఆవరించి ఉంది. అది నెమ్మదిగా దక్షిణ వైపు వస్తేనే గానీ.. వర్షాలు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం చాలా చోట్ల ఉష్ణోగ్రతలు నమోదయి.. వేడి వాతావరణం కొనసాగుతూ.. సాయంత్రానికి చల్లబడే పరిస్థితిలో ఉంటాయని పేర్కొంటున్నారు. ఇక ఒకటి రెండు ప్రాంతాల్లో జల్లులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయంటున్నారు.

అయితే వర్షాకాలం సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి జూన్, జూలై నెలలో ఆశించినంత వర్షాలు కురియలేదు. జూన్‌లో మోస్తారు వర్షాల కురవగా.. జూలైలో కాస్త పరవాలేదనిపించాయి. తెలంగాణలో వర్షాలు ఒకింత భారీగానే కురిశాయి. ఇక ఆగస్టు తొలిపక్షంలో ఎండలు మెండైపోయాయి. ఆగస్టులో సాధారణంగా అంటే తక్కువ వర్షపాతం రికార్డ్ అయినట్లు అధికారులు తెలిపారు. మళ్లీ ఎండల పరిస్థితి వచ్చింది. అయితే రుతుపవన ద్రోణి ఉత్తరాది రాష్ట్రాల వైపు వెళ్లిపోవడమే తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితులకు కారణమని వాతావరణ శాఖ చెబుతున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో మళ్లీ సాధారణ స్థితిలు నెలకొంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవన ద్రోణి బంగాళాఖాతంలో ఉత్తరం వైపు విస్తరించి ఉంది. దీంతో రుతుపవనాలు మరింత యాక్టివ్‌గా మారితే.. బంగాళాఖాతంలో అల్పపీడనంలో ఏర్పడే అవకాశం ఉంది.

Tags:    

Similar News