కేశినేని వార్నింగ్. టీడీపీకి షాక్ ఇస్తారా?

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.

Update: 2022-06-25 03:20 GMT

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. తన పట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఆయన గుర్రుగా ఉన్నారు. అందుకే కేశినేని నాని నేరుగా చంద్రబాబును కలిశారు. ఆయనను కలసి వచ్చిన తర్వాత చంద్రబాబుకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. తన శత్రువులను మీరు ప్రోత్సహిస్తే, నేను మీ శత్రువులతో చేతులు కలుపుతానని మీడియా చిట్ చాట్ లో కేశినేని నాని చెప్పారు. . తాను అందరి వాడినని, ఏ పార్టీకి చెందిన వాడిని కాదని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

బతిమాలుతుందని....
కేశినేని నాని స్వయంగా కొంతకాలం క్రితం వెళ్లి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చంద్రబాబు మొహం మీదనే చెప్పేసి వచ్చారు. పార్టీ అధినాయకత్వం తననున బతిమాలుతుందని నాని భావించినట్లుంది. కానీ చంద్రబాబు అటువంటి ప్రయత్నాలు చేయలేదు. తన వ్యతిరేక వర్గం బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. బుద్దా వెంకన్నను ఉత్తరాంధ్రకు ఇన్‌ఛార్జిగా కూడా నియమించారు. పశ్చిమ నియోజకవర్గానికి తనను ఇన్ ఛార్జిగా నియమించినా అక్కడి నేతలు ఎవరూ సహకరించడం లేదు. పైగా వారిని టీడీపీ హైకమాండ్ ప్రోత్సహిస్తుందన్నది కేశినేని నాని ఆరోపణ.
సొంత ఫ్యామిలీలోనూ...
దీంతో పాటు తన సొంత కుటుంబంలో కూడా పార్టీ జోక్యం చేసుకుంటుందని కేశినేని నాని భావిస్తున్నారు. నాని సోదరుడు కేశినేని శివనాధ్ అలియాస్ చిన్నిని పార్టీ నాయకత్వం ప్రోత్సహించడం ఆయనకు మంట పుట్టించింది. నానిని కాదని చిన్ని పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ ను కలసి వచ్చిన తర్వాత చిన్ని మరింత దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటుకు పోటీకి తాను దిగుతానని చిన్ని చెబుతుండటం నానికి మంట తెప్పిస్తుంది. అందుకే చంద్రబాబుకు పరోక్షంగా కేశినేని నాని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.
టీడీపీ నుంచి....
మరోవైపు కేశినేని నాని త్వరలోనే టీడీపీ నుంచి బయటకు వస్తారని ఆయన వర్గం చెబుతోంది. తన కుమార్తెకు కార్పొరేషన్ మేయర్ సీటు ఇచ్చినా డబ్బు ఖర్చు పెట్టుకుంటారనే ఇచ్చారని, కార్పొరేషన్ ఎన్నికల తర్వాత చంద్రబాబు వైఖరి పూర్తిగా మారిపోయిందని నాని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఆయన ప్రకటన చేసే అవకాశముందని చెబుతున్నారు. బీజేపీకి అనుకూలంగా మారతారా? లేదా వైసీపీలో చేరతారా? అన్నది పక్కన పెడితే కేశినేని నాని మాత్రం పార్టీపై ఫైర్ అవ్వడం ఖాయంగా కన్పిస్తుంది. టీడీపీకి బెజవాడలో కొంత ఎదురు దెబ్బతగిలినట్లేనని అంటున్నారు.


Tags:    

Similar News