ఉండవల్లికి అంతా తెలుసు.. కానీ..?

ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పింది నిజమే. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ గెలిచినా బీజేపీకి 25 పార్లమెంటు సీట్లు వచ్చినట్లే.

Update: 2022-06-18 07:33 GMT

ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పింది నిజమే. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ గెలిచినా బీజేపీకి 25 పార్లమెంటు సీట్లు వచ్చినట్లే. దీనికి ఉండవల్లి చెప్పిన కారణం బీజేపీని ఏ పార్టీ వ్యతిరేకించకపోవడంతో ఎక్కడా లేని విధంగా బీజేపీ బలంగా ఉందని చెప్పారు. జనసేన ఇప్పటికే మిత్రపక్షంగా ఉంది. వైసీపీ కూడా బీజేపీకి అన్ని అంశాలలో మద్దతు ఇస్తుంది. ప్రతిపక్ష టీడీపీ కూడా బీజేపీని పట్టుకుని వేలాడుతుంది.

రాష్ట్ర విభజనకు...
ఇందుకు అనేక కారణాలున్నాయి. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టింది. విడగొట్టడంలో కూడా అభ్యంతరకరమైన రీతిలో విభజన చేసింది. ఏకపక్షంగా చేసిన ఈ విభజనతో కాంగ్రెస్ అంటేనే ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. అందుకే గత దశాబ్దకాలంగా ఆపార్టీ కి ఏ నియోజకవర్గంలోనూ డిపాజిట్లు కూడా దక్కడం లేదు. కాంగ్రెస్ పైన ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలకు ఏదో ఒక పార్టీతో సత్సంబంధం ఉండాలి.
కాంగ్రెస్ తో కలిసే....
కానీ కాంగ్రెస్‌తో కలిసే సాహసం ఎవరూ చేయరు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలిపారు. ఫలితంగా 2019 లో 23 సీట్లకే పరిమితమయ్యారు. ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకపోయినా తెలంగాణలో పెట్టుకున్న పొత్తు ప్రభావం ఈ ఎన్నికలపై పడిందంటున్నారు. అందుకే భవిష్యత్ లో ఏ పార్టీ కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తిరిగే అవకాశమే లేదు. ఇక ప్రత్యామ్నాయంగా ఉన్నది బీజేపీయే కావడంతో దానితో ప్రతి పార్టీ అంటకాగక తప్పని పరిస్థితి.
కేంద్రంలో అధికారం....
కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా మరో పార్టీ లేదు. కాంగ్రెస్ దాదాపు అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడుతుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పుంజుకుంటుందన్న ఆశలు ఏమాత్రం లేవు. మోదీ, అమిత్ షాల హయాంలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావడం కల్ల అన్నది రాజకీయ విశ్లేషకులు సయితం అంగీకరిస్తుంది. అందుకే బీజేపీతో ఏపీలోని అన్ని పార్టీలూ సఖ్యతగా మెలుగుతున్నాయి. రాష్ట్ర అవసరాల కోసం కావచ్చు. సొంత ప్రయోజనాలు కోసం కావచ్చు. ఎవరు ఏమి చెప్పినా ఈ పరిస్థితి మరికొంత కాలం మారదన్నది వాస్తవం.


Tags:    

Similar News