ఎంతైనా తండ్రి కదా.. ఎక్కడైనా జరిగేది అదే కదా?

అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ముఖ్యమంత్రి స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు

Update: 2022-12-14 08:20 GMT

ఎక్కడైనా తండ్రి అంతే. తన వారసుడి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. తనకు ఇష్టంలేకపోయినా కుటుంబం నుంచి వత్తిడులు వస్తాయి. పార్టీలోని భజనపరులు కూడా ప్రెషర్ తెస్తారు. ఎలాంటి రాజకీయ నేతకైనా ఇది తప్పదు. తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఎన్నికయినప్పుడు ఆయన తన కుటుంబ సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకోరని అందరూ భావించారు. ఆయన విలక్షణ నేత అని విమర్శకులు సయితం ప్రశంసించారు. తన కుమారుడు ఉదయనిధి చెపాక్ నియోజకవర్గం నుంచి విజయం సాధించినా ఆయనను ఎమ్మెల్యేగానే ఉంచుతారని భావించారు. కానీ దాదాపు రెండేళ్లు కావస్తుంది. స్టాలిన్ మాత్రం కుటుంబ సభ్యులను కేబినెట్ లోకి తీసుకోలేదు.

కరుణానిధి రాజకీయ వారసత్వాన్ని...
స్టాలిన్ కూడా తండ్రి కరుణానిధి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకునే పదవులు పొందారు. చెన్నై కార్పొరేషన్ మేయర్ నుంచి స్టాలిన్ వివిధ హోదాల్లో పనిచేశారు. కరుణానిధి జీవించి ఉన్నంత కాలం డీఎంకే పార్టీ వ్యవహారాలన్నీ చూసినా ఆయన మాత్రం అధ్యక్ష పదవిని చేపట్టలేదు. తండ్రి వెనకుండి తమిళనాడు పాలిటిక్స్ లో కీలక భూమిక పోషించారు. తన సోదరుడు ఆళగిరిని పక్కన పెట్టడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు. తండ్రి వద్ద నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకున్న స్టాలిన్ ఆయన మరణం అనంతరం ఏకంగా పార్టీని అధికారంలోకి తేగలిగారు.
రెండున్నర దశాబ్దాల తర్వాత...
స్టాలిన్ కూడా వెంటనే మంత్రి వర్గంలోకి రాలేదు. 14 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్టాలిన్ డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడిగా చేపట్టారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఈ పదవిలో ఉండి పార్టీలో యువజన విభాగాన్ని బలోపేతం చేశారు. 1980వ దశకంలోనే రాజకీయాల్లో అడుగుపెట్టినా 2006లో గాని ఆయన మంత్రి కాలేదు. 2006లో ఆయన గ్రామీణాభవృద్ధి మంత్రిగా పనిచేశారు. అంటే రెండున్నర దశాబ్దాల తర్వాత గాని స్టాలిన్ మంత్రి పదవిలో కూర్చోలేకపోయారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు. అదే బాటలో తన కుమారుడు ఉదయనిధిని కూడా డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడిని చేశారు. గత ఎన్నికల్లో చెపాక్ నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చారు.

నెంబర్ టూగానే...
ఉదయ నిధి గెలిచిన వెంటనే కేబినెట్ లోకి తీసుకోలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన తన కుమారుడు ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈరోజు ఉదయనిధి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉదయనిధికి క్రీడల శాఖ బాధ్యతలను అప్పగించారు. శాఖ ఏదైనా సరే ఉదయనిధి పార్టీలోనే కాకుండా ఇప్పుడు ప్రభుత్వంలోనూ నెంబర్ టూ గా మారనున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన వత్తిడి, తన వారసత్వాన్ని ముందుగానే ప్రజల ముందుకు తేవాలన్న లక్ష్యంతో స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధిని కేబినెట్ లోకి తీసుకున్నారంటున్నారు. ఉదయనిధి పొలిటికల్ లీడర్ కాక ముందు సినీ హీరో. చలన చిత్ర పరిశ్రమలోనూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.


Tags:    

Similar News