డీఎస్ కు "ఎస్" అట... ఛెయిర్ రెడీ చేస్తున్నారట

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఎట్టకేలకు నిర్ణయం తీసుకన్నారు. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.

Update: 2021-12-16 14:12 GMT

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఎట్టకేలకు నిర్ణయం తీసుకన్నారు. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈరోజు ఢిల్లీలో సోనియాగాంధీని కలిసిన డి.శ్రీనివాస్ తాను కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై చర్చలు జరిపారు. సోనియా గాంధీ కూడా డీఎస్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కు డీఎస్ చేరిక విషయమై చెప్పి తెలంగాణ రాష్ట్ర నేతలతో మాట్లాడాలని సూచించినట్లు సమాచారం.

రేపు ఢిల్లీకి....
ఈ మేరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు పార్టీ అధినాయకత్వం నుంచి పిలుపు వచ్చింది. రేపు ఉదయం ఇద్దరూ ఢిల్లీ బయలు దేరి వెళుతున్నారు. డి.శ్రీనివాస్ చేరికపై హైకమాండ్ వీరిద్దరితో చర్చించనున్నట్లు చెబుతున్నారు. సోనియాగాంధీయే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత డీఎస్ చేరికకు ఇక ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చు. వ్యతిరేకించినా పెద్దగా ఫలితం ఉండదని తెలుసు.
సీనియర్ నేతలతో....
కానీ డి.శ్రీనివాస్ సీనియర్ నేత. ఆయనను పార్టీ ఎలా ఉపయోగించుకుంటుందన్నది ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలే పెద్ద సమస్య. వారు ఎవరి మాట వినరు. తమంతట తాము కదలరు. ప్రజలే తాము గెలిపించుకోవాలన్న పాత కాలం భావనలతో సాగిపోతున్నారు. వీరికి డీఎస్ లాంటి వాళ్లు జోడయితే పార్టీ ఇక కదిలే ప్రసక్తి ఉండదంటున్నారు. డీఎస్ సామాజికవర్గం పరంగా తప్పించి మరే రకమైన ఉపయోగం ఆయన వల్ల లేదు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన పర్యటనలు కూడా చేయలేరు.
ఉపయోగం ఉందా?
ఈ సమయంలో డీఎస్ లాంటి నేతల చేరిక అవసరమా? అన్న ప్రశ్న యువనేతల్లో వ్యక్తమవుతుంది. వారి కంటే యువకులను ప్రోత్సహిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని కొందరు సూచిస్తున్నారు. కానీ అది కాంగ్రెస్ కదా? హమారా జమానా అంటూ పాత కాపులకే పెద్ద పీట వేస్తుంది. డి.శ్రీనివాస్ ఇప్పుడు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పదవీకాలం కూడా పూర్తి కావస్తుంది. అందుకే ఆయన రేపో,మాపో హస్తం పార్టీ నీడన చేరిపోతారంటున్నారు. ఆయన చిన్న కుమారుడు అరవింద్ మాత్రం బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు.


Tags:    

Similar News