న్యూ ఇయర్ ఎఫెక్ట్ - హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు !

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని మూడు కమిషనరేట్లు.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ ఆంక్షలు అమలవుతాయని పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి

Update: 2021-12-30 10:46 GMT

2021 సంవత్సరం ముగిసి.. 2022 లో అడుగు పెట్టేందుకు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది. డిసెంబర్ 31 అంటేనే చాలా మంది తాగి.. పార్టీలు చేసుకుంటుంటారు. ఇలాంటి వారి వల్లే అధికంగా రోడ్డుప్రమాదాలు జరిగే ప్రమాదం లేకపోలేదు. అందుకే నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని మూడు కమిషనరేట్లు.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ ఆంక్షలు అమలవుతాయని పోలీసులు వెల్లడించారు.

డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. పోలీసులు విధించిన ఈ ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. వీలైనంతవరకూ ప్రజలు ఇళ్లలోనే ఉండి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఫ్లై ఓవర్ల మూసివేత
హైదరాబాద్లోని సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, మైండ్ స్పేస్, ఫోరంమాల్, రోడ్ నెంబర్ 45, దుర్గం చెరువు బ్రిడ్జ్, బాబు జగ్జీవన్ రామ్, బేగంపేట్, ప్యారడైజ్, నారాయణగూడ, బషీర్ బాగ్, ఎల్బీనగర్, మలక్ పేట్, నెక్లెస్ రోడ్, మెహదీపట్నం, పంజాగుట్ట ప్లై ఓవర్లను పోలీసులు మూసివేయనున్నారు. అనుమతి ఉన్నవారికి మాత్రమే పీవీ ఎక్స్ ప్రెస్ వే పైకి అనుమతించనున్నారు. అదేవిధంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఓఆర్ఆర్ పై కార్లను అనుమతించరు. కేవలం లారీలు, గూడ్స్ వాహనాలకు దీని నుంచి మినహాయింపు ఉంది.
క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యేక ఆదేశాలు
న్యూ ఇయర్ సందర్భంగా నగర పోలీసులు క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. క్యాబ్ ల డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫారమ్ ధరించడంతో పాటు.. సరైన ధృవపత్రాలను కారులో ఉంచుకోవాలని సూచించారు. అలాగే క్యాబ్ బుకింగ్స్ ను రద్దు చేస్తే.. మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 178 ప్రకారం రూ.500 ఫైన్ విధించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగని కస్టమర్ల నుంచి అధిక ఛార్జీలు కూడా వసూలు చేయరాదని, అలా చేసినట్లు ఫిర్యాదులు వస్తే.. ఆ క్యాబ్ డ్రైవర్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు.. డిసెంబర్ 31వ తేదీ రాత్రి డ్రంక్ డ్రైవ్ తనిఖీలు కూడా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మద్యంతాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారికి మోటార్ వెహికల్ యాక్ట్ 1988లోని సెక్షన్ 185 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అలాగే వాహనాలను సీజ్ చేసి, జరిమానా కూడా విధిస్తామని పేర్కొన్నారు. కాబట్టి వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, ఎవ్వరూ మద్యం సేవించి వాహనం నడపరాదని హెచ్చరించారు.


Tags:    

Similar News