గర్జించిన పాక్.. బేల చూపులేల?

మొన్న శ్రీలంక నేడు పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. కరోనా అనంతరం రెండు దేశాల ఆర్థిక పరిస్థితి క్షీణించింది.

Update: 2023-01-19 06:26 GMT

మొన్న శ్రీలంక.. నేడు పాకిస్థాన్ .. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. కరోనా అనంతరం ఈ రెండు దేశాల ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించింది. ఎంతగా దిగజారాయంటే పాక్ లో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆహారం కోసం క్యూ లైన్లు.. కొట్లాటలు చివరకు మరణాలకు దారితీస్తున్నాయి. కుటుంబ సభ్యుల కడుపు నింపేందుకు వీధి పోరాటాలకు పాక్ ప్రజలు దిగుతున్నారంటే అతిశయోక్తి కాదు. గోధుమ పిండి కోసం పెద్ద యుద్ధాలే అక్కడ జరుగుతుండటం విశేషం. ఒక ట్రక్కు గోధుమ పిండి వెళుతుంటే దాని వెనక పరుగులు తీస్తున్న ప్రజల స్థితి కన్నీటిని తెప్పిస్తున్నాయి.


ముందుగానే అంచనాలు...

పాకిస్థాన్‌లో అలాంటి పరిస్థితులు వస్తాయని ముందు నుంచి ఊహిస్తున్నదే. ప్రభుత్వాలు మారుతుండటం, సరైన ఆర్థిక విధానాలను అవలంబించకపోవడం, ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు కృషి చేయకపోవడం, ఉపాథి అవకాశాలను మెరుగుపర్చకపోవడం వంటి కారణాలతో పాక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని అంచనాలు తొలి నుంచి వినపడుతున్నాయి. ఆర్థిక వేత్తలు కూడా హెచ్చరిస్తూ వస్తున్నారు. అయినా పాలకులు పెద్దగా పట్టించుకోలేదు. అణ‌్వాస్త్రాల మీద చూపెట్టిన శ్రద్ధ అన్న వస్త్రాల మీద చూపెట్టలేదన్న విమర్శలను పాక్ పాలకులు ఎదుర్కొంటూ వస్తున్నారు.
శ్రీలంక తరహాలోనే..
విదేశీ మారక నిల్వలు అడుగంటి పోతున్నాయి. అచ్చం శ్రీలంక తరహాలోనే అప్పుల ఊబిలో పాక్ ఇరుక్కుపోయింది. ఇప్పుడు అందరి ఎదుట చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలను సాయం కోసం అర్థించింది. కాని వాటి నుంచి మొండి చేయేఎదురయింది. ఇప్పుడు భారత్ వైపు చూస్తుంది. భారత్ తో శాంతిని కోరుకుంటున్నామని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. యుద్ధాల వల్ల పాక్ నష్టాలను చవి చూసిందన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారంటే ఏమేరకు వెనక్కు తగ్గారో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి. విద్యుత్తును ఆదా చేయడం కోసం అనేక చర్యలు చేపట్టారు. పది గంటలకే అన్నీ దుకాణాలను మూసేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.


 ఆర్థిక సహకారం కోసం...

ఆర్థిక సహకారం కోసం పాక్ ప్రపంచ దేశాలన్నింటినీ అర్థిస్తుంది. కానీ కరోనా తర్వాత అన్ని దేశాలూ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తమ దేశ పరిస్థితులను చక్కదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాయి తప్పించి ఏ దేశమూ మరొక దేశానికి సాయం అందించే పరిస్థితుల్లో లేదు. శ్రీలంక ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. ద్రవోల్బణం పెరిగిపోయింది. పాక్ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. అన్ని ఖర్చులను ప్రభుత్వం తగ్గించుకుంటూ వస్తుంది. అనేక చర్యలు తీసుకుంటున్నా పాక్ లో పరిస్థితులు మెరుగుపడే అవకాశం కనిపించడం లేదు. బడ్జెట్ లో భారీ కోతలను విధించాలని డిమాండ్ వినపడుతుంది. అంతకు ముందు కరోనా, గత ఏడాది వరదలు పాక్ ను అతలాకుతలం చేశాయి. వరదల వల్ల నలభై బిలయన్ డాలర్ల వరకూ నష్టం సంభవించినట్లు అంచనాలు వేస్తున్నారు.
విదేశీ మారక నిల్వలు...
ఆహార ధాన్యాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి కూడా ఆర్థిక నిల్వలు తగినంతగా లేకపోవడంతో బేల చూపులు చూడటం మినహా మరేమీ చేయలేకపోతుంది. డాలర్ల నిల్వ కూడా అడుగింటి పోయింది. చివరకు ముఖ్యమైన మెడిసిన్స్ ను కూడా దిగుమతి చేసుకోలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. చైనా కూడా సాయానికి చేతులెత్తేయడంతో పాకిస్థాన్ ఇప్పుడు బిత్తర చూపులు చూస్తుంది. కడుపు నింపుకునేందుకు కొట్లాటలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలని పాక్ పౌరులు ప్రార్ధించడం మినహా మరేమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ దారుణమైన పరిస్థితికి పాక్ పాలకుల వైఖరే కారణమన్న విమర్శలయితే వినిపిస్తున్నాయి. సివిల్ వార్ వచ్చినా ఆశ్చర్యం లేదన్న అంతర్జాతీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరి పాక్ ఈ గండం నుంచి ఎలా బయటపడుతుందనేది అంతర్జాతీయంగా పెద్ద చర్చగా మారింది.


Tags:    

Similar News