వసంత vs జోగి.. రంగంలోకి జగన్

మైలవరం నియోజకవర్గం వైసీపీ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై నేడు ముఖ్యమంత్రి జగన్ నేరుగా దృష్టి పెట్టనున్నారు

Update: 2023-02-09 08:26 GMT

గత కొద్దిరోజులుగా మైలవరం నియోజకవర్గం వైసీపీ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై నేడు ముఖ్యమంత్రి జగన్ నేరుగా దృష్టి పెట్టనున్నారు. ఈరోజు సాయంత్రం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్నారు. ఈ మేరకు అపాయింట్‌మెంట్ లభించింది. వసంత కృష్ణప్రసాద్ తో నేరుగా మాట్లాడి మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి నేరుగా చర్చించనున్నారు.

మైలవరం పంచాయతీ...
గత కొంతకాలంగా మంత్రి జోగిరమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. 2014 ఎన్నికల్లో మైలవరంలో పోటీ చేసి ఓటమి పాలయిన జోగి రమేష్ ఇప్పటికీ తన అనుచరులకు అక్కడ పదవులు దక్కాలని కోరుకుంటున్నారు. వసంత కృష్ణప్రసాద్ కూడా అందరినీ కలుపుకుని పోకుండా జోగి రమేష్ అనుచరులను వేరుగా చూడటం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది.
సీఎం వద్దకు నేడు...
గతంలో ఈ వివాదాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద పంచాయతీ జరిగింది. అయినా వివాదం కొలిక్కి రాలేదు. సోషల్ మీడియాలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు బురద జల్లుకునే కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నాయి. దీంతో పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టకపోతే మరింత డ్యామేజీ అయ్యే అవకాశముందని భావించి నేరుగా ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగినట్లు తెలిసింది. మరి ఇప్పటికైనా సమస్య పరిష్కారం అవుతుందా? లేదా? అన్నది చూడాలి.


Tags:    

Similar News