తిరుమల మూసివేతపై రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు

Update: 2018-07-17 07:31 GMT

తొమ్మిది రోజుల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం, తిరుమలలో ఎవరూ ఉండకుండా చేసేలా టీటీడీ తీసుకున్న నిర్ణయంపై తిరుమల ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలు చేశారు. టీటీడీ తీసుకున్న నిర్ణయం గతంలో ఎప్పుడూ జరగనిదని, ఎవరినీ అనుమతించకపోవడం, సీసీ కెమెరాలను సైతం నిలిపేయడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. తాను రెండు నెలల క్రితం ఆలయంలో శ్రీవారి సంపద కోసం జరిగిన తవ్వకాలు, ఆభరణాల మాయం వంటి అంశాలపై చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేలా టీటీడీ నిర్ణయాలు ఉన్నాయన్నారు. వీటిపై సీబీఐ విచారణ కోరుతూ...సుప్రీంకోర్టులో సుబ్రమణ్యస్వామి పిటీషన్ వేయనున్నందున ఇంతకుముందు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీటీడీ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ఆనాడే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు...

9 రోజుల పాటు దర్శనం ఆపేస్తామని చెప్పడం దారుణన్నారు. చరిత్రలో ఇదే మొదటిసారని అన్నారు. ‘‘స్వామివారి దర్శనం కొన్నిరోజులు ఉండదని, ఆభరణాలు చోరీకి గురవుతాయని’’ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారని ఆయన గుర్తు చేశారు. భక్తులు బాధపడకుండా, ఆలయం తెరిచేలా టీటీడీపై ఒత్తిడి తేవాలని కోరారు. టీటీడీ ఛైర్మన్ స్వతాహా ఇంతపెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం లేదని, ఆయన నిర్ణయం వెనక ఎవరో ఉన్నారని సందేహం వ్యక్తం చేశారు. గతంలో మహా సంప్రోక్షణ జరిగిన సమయంలో ఉన్నా అధికారి ఎవరూ ఇప్పుడు లేరని, సేవా భావం లేని వారు బోర్డులో ఉన్నందున ఇటువంటి నిర్ణయాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Similar News