అమ్మకు పాదాభివందనం... నాన్నతో ఆలింగనం

నారా లోకేష్ హైదరాబాద్ నుంచి పాదయాత్రకు బయలుదేరి వెళ్లేముందు చంద్రబాబు ఇంటిలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది

Update: 2023-01-25 12:05 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాద్ నుంచి పాదయాత్రకు బయలుదేరి వెళ్లేముందు చంద్రబాబు ఇంటిలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. తల్లి భువనేశ్వరికి పాదాభివందనం చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. తండ్రి చంద్రబాబును ఆప్యాయంగా కౌగిలించుకుని ఆల్ ది బెస్ట్ చెప్పించుకున్నారు. మామయ్య నందమూరి బాలకృష్ణ దంపతుల ఆశీస్సులను నారా లోకేష్ అందుకున్నారు. ఇక తనయుడు దేవాన్ష్ తండ్రిని కౌగించుకుని అమాయకంగా పెట్టిన మొహం అక్కడ ఉన్న వారికి సయితం కంటతడి పెట్టించింది. సతీమణి బ్రాహ్మణి హారతులివ్వగా బయలుదేరి వెళ్లారు.


ఎల్లుండి నుంచి...

నారా లోకేష్ హైదరాబాద్ లోని తన ఇంటి నుంచి బయలుదేరి ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. నేరుగా కడపకు వెళ్లి అక్కడ అమీన్ పీన్ దర్గాను సందర్శించి, చర్చిలో ప్రార్థనలను చేసిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరుకోనున్నారు. ఈ రాత్రికి తిరుమలలోనే నారా లోకేష్ బస చేసి ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నానికి కుప్పం చేరుకుంటారు. ఎల్లుండి నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. అందుకు తగిన ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు.

పదిహేను నెలలు...
నారా లోకేష్ నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. అంటే ఏడాదికి పైగానే ఇంటి మొహం చూడరు. దాదాపు పదిహేను నెలల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం అందరికీ సాధ్యం కాదు. కసి, పట్టుదలతో పాటు పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ఆ మాత్రం రిస్క్ చేయక తప్పదు. పార్టీకి భవిష్యత్ నేతగా ఆయన క్యాడర్ లో భరోసా నింపాలి. నేతల్లో ఉత్సాహాన్ని పెంచాలి. అప్పుడే పార్టీ అధికారంలోకి వస్తుంది. తన తండ్రి చంద్రబాబు వయసుకు అది సాధ్యం కాకపోవడంతో ఆ బాధ్యతను లోకేష్ భుజానికెత్తుకున్నారు.

రిస్క్ తో కూడినదే...
నిజానికి నాలుగువేల కిలోమీటర్ల పాదయాత్ర అంటే అంత సులువు కాదు. ఎండనక, వాననక, చలికి అన్నీ భరించాలి. గోల్డెన్ స్పూన్ తో జన్మించిన నారా లోకేష్ పెద్ద రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి. తన నాయకత్వంపై నమ్మకం పెంచుకోవాల్సిన బాధ్యత కూడా నారా లోకేష్ పై ఉంది. గత ఎన్నికల్లో తాను ఓటమి పాలయినా కుంగిపోకుండా, నేతలను సమన్వయం చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచిన నారా లోకేష్ పదిహేను నెలల పాటు ప్రజల్లనే ఉండనున్నారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. దగ్గరగా వారి వేదనను చూడగలుగుతారు. ఈ పాదయాత్ర నారాలోకేష్ ను సమూలంగా మారుస్తుందని పార్టీ నేతలు సయితం భావిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ లోకేష్.


Tags:    

Similar News