సింప‌తీకి స‌మ‌యం ఉంది మిత్రమా?

మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిప‌క్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఏం చేసినా ఇలాగే ఉంటుంది. ఏం చేయ‌క‌పోయినా ఇలాగే ఉంటుంది

Update: 2021-11-20 08:14 GMT

మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిప‌క్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఏం చేసినా ఇలాగే ఉంటుంది. ఏం చేయ‌క‌పోయినా ఇలాగే ఉంటుంది. ఆయ‌న రాజ‌కీయ‌,కుటుంబ జీవితంలో ఇలా వెక్కి వెక్కి క‌న్నీళ్లు పెట్టుకున్నది ఇప్పుడే. త‌న రాజ‌కీయ మిత్రుడు కింజార‌పు ఎర్రంనాయుడు మ‌ర‌ణించిన‌ప్పుడు క‌న్నీళ్లు తుడుచుకున్నట్లు భ‌మ్రింప‌చేశారు త‌ప్ప ఆ స‌మ‌యంలో క‌న్నీళ్లు రాలేదు. శుక్రవారం నాటి అసెంబ్లీ స‌మావేశాల త‌ర్వాత మాత్రం ఆయ‌న ఘొల్లుమ‌న్నారు. చిన్నపిల్లాడిలా ఏక‌ధాటిగా ఏచ్చేశారు. ఆయ‌న‌ని చాలా ద‌గ్గర‌గా చూపిన రాజ‌కీయ‌, కుటుంబ స‌భ్యుల‌కు ఇది చాలా కొత్త.

ప్రతి పనికీ ఒక లెక్క....
త‌మ నాయ‌కుడికి కూడా క‌న్నీళ్లు ఉంటాయా అని తొలుత వారంతా విస్తుపోయి ఉంటారు. ఆన‌క తేరుకునుంటారు. చంద్రబాబు నాయుడు ఏ ప‌ని చేసినా ఓ లెక్క ఉంటుందని తెలుగు నాటే కాదు జాతీయ స్థాయిలోను ఆయ‌న‌ను ఎరిగిన వారంటారు. ఎక్కడ ఏ పాచిక వేయాలో ఆయ‌న‌కు తెలిసిన‌ట్లుగా ఎవ‌రికీ తెలియ‌ద‌ని అంద‌రి ఉవాచ‌. ఇది చాలాసార్లు నిజ‌మైంది కూడా. అలాగే కొన్నిసార్లు దెబ్బ త‌గిలింది కూడా. ఈ సారి మాత్రం చంద్రబాబు కార్చిన క‌న్నీళ్లకు ఏమంత విలువ ఉండేలా క‌నిపించ‌డం లేదు. సింప‌తీ కొట్టేయాల‌నే తలంపుతోనే ఇంత‌లా బావురుమ‌న్నారా అనే వాళ్లే ఎక్కువ మంది అయ్యారు.
కన్నీళ్లకు కారణం....
క‌న్నీళ్లకు కార‌ణం గురించి వెత‌క‌డం అన‌వ‌స‌రం. ఎందుకంటే ఆ కార‌ణం ఏమిటో ఆయ‌నే స్వయంగా చెప్పారు. త‌న భార్యను సైతం వీళ్లు వ‌ద‌ల‌డం లేద‌ని, అందువ‌ల్ల తాను తీవ్ర మ‌నోవేద‌న అనుభ‌విస్తున్నాన‌ని ఆయ‌న మాట‌ల సారాంశం. అయితే ఈ క‌న్నీళ్లకు ప్రతిఫ‌లం ఉంటుందా... అనేదే ఇప్పడు చ‌ర్చ. ఉండ‌దు అనే వారే ఎక్కువ మంది ఉన్నారు. ఈ విష‌యాన్ని పార్టీలోని వారే ఆంత‌రంగికంగా చెవులు కొరుక్కుంటున్నట్లు వినికిడి. ఇది ఒక విధంగా నిజం అనిపిస్తోంది కూడా. నిజానికి, చంద్రబాబు నాయుడే కాదు దేశంలో ఏ రాజ‌కీయ నాయ‌కుడు క‌న్నీళ్లు కార్చినా ప్రజ‌లు ప‌ట్టించుకునే ప‌రిస్థితుల్లో లేరు. అయినా చంద్రబాబు నాయుడు క‌న్నీరు పెట్టుకున్నారంటే ఏదో ఒక ప‌ర‌మార్ధం ఉంటుంద‌నే వారున్నారు.
అలిపిరి దాడి....
గ‌తంలో అలిపిరిలో చంద్రబాబు నాయుడిపై ఇప్పటి మావోయిస్టు, అప్పటి పీపుల్స్‌వార్ బాంబు దాడి చేసింది. దీన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు నాయుడు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ఆ స‌మ‌యంలో స‌మైక్య రాష్ట్రంలోనే ఉన్నాం క‌నుక ౨౩ జిల్లాల్లోనూ చంద్రబాబు నాయుడు చొక్కాపై ర‌క్తపు మ‌ర‌క‌లున్న నిలువెత్తు పోస్టర్లతో ప్రచారం చేశారు తెలుగు త‌మ్ముళ్లు. ఇది త‌మ‌కు చాలా లాభం చేకూరుస్తుంద‌ని చంద్రబాబుతో స‌హా తెలుగు త‌మ్ముళ్లంతా ఆశించారు.
ఫలితాలు చూసిన తర్వాత...?
కాని, ఎన్నిక‌ల ఫ‌లితాలు మాత్రం వేరేలా వ‌చ్చాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు చూసిన త‌ర్వాత బాంబు దాడిని స‌రైన స‌మ‌యంలో వాడుకోలేక‌పోయామ‌ని, ఎన్నిక‌లు ఆల‌స్యం కావ‌డం వ‌ల్ల ఆనాడు సింప‌తీ రాలేద‌ని తెలుగుదేశం పార్టీ భావించింది. అదే విష‌యాన్ని పార్టీలో ప్రచారం కూడా చేసుకుంది. 2003 సంవ‌త్సరం అక్టోబ‌ర్ నెల‌లో చంద్రబాబు నాయుడిపై న‌క్సలైట్లు దాడి చేశారు. ఆ త‌ర్వాత 2004 సంవ‌త్సరంలో ఎన్నిక‌లు జ‌రిగాయి. బాంబు దాడి జ‌రిగిన కొన్ని నెల‌ల‌కే చంద్రబాబు నాయుడి ప‌ట్ల తెలుగు ప్రజ‌లు సానుభూతి చూపించ‌లేదు. పైగా అత్యధిక మెజార్టీతో వై.ఎస్.రాజ‌శేఖ‌ర రెడ్డి నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అంత‌వ‌రకూ 180 స్థానాలున్న తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నిక‌ల్లో 47 స్థానాల‌కు ప‌డిపోయింది. ర‌క్తపు మ‌ర‌క‌లున్న చంద్రబాబు నాయుడిపై కొన్ని నెల‌లు కూడా సానుభూతిని చూపించ‌లేక‌పోయారు తెలుగు ఓట‌ర్లు.
అలిపిరి అనుభవం...
ఇప్పుడు రెండున్నర సంవ‌త్సరాల త‌ర్వాత జ‌రిగే ఎన్నిక‌ల్లో ఈ క‌న్నీళ్లు కాపు కాస్తాయా అనేది పెద్ద ప్రశ్న. చంద్రబాబు నాయుడు క‌న్నీళ్లు పెట్టుకున్న శుక్రవారం నాడే సోష‌ల్ మీడియాలో పాచిక పార‌దు అనే అర్ధం వ‌చ్చేలా పోస్టులు వైర‌ల్ అయ్యాయి. ప్రజ‌ల్లో సానుభూతి కొట్టేయ‌డానికి ఇప్పటి క‌న్నీళ్లు రెండున్నరేళ్ల త‌ర్వాత ఉప‌క‌రిస్తాయా. పాత అలిపిరి అనుభ‌వంతో చూస్తే అక్కరకు వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. ఈ రెండున్నరేళ్లలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకుమూడు నిమిషాల క‌న్నీళ్లు ఏ మూల‌కు స‌రిపోతాయ‌ని తెలుగు త‌మ్ముళ్ల అంత‌ర్గత ఆవేద‌న‌. కోయిల స‌మ‌యానికి కూస్తే బాగుంటుంది. తొంద‌ర‌ప‌డి ఓ కోయిల ముందే కూస్తే.... ఏమ‌వుతుందో...రెండున్నరేళ్లు ఆగాలి


Tags:    

Similar News