మరోసారి ఢిల్లీకి అట... ఈసారి గ్యారంటీ అట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Update: 2021-12-01 06:49 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దలను కలవాలని చంద్రబాబు భావిస్తున్నారు. గతంలో ఢిల్లీ వెళ్లినా కేంద్రం పెద్దలను చంద్రబాబు కలవలేకపోయారు. వారి అపాయింట్ మెంట్లు దొరకడం లేదు. అయితే ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో ఒకసారి ఢిల్లీ వెళ్లి వస్తే మంచిదని చంద్రబాబు భావిస్తున్నారు.

మరోసారి...
దీనిపై ఇప్పటికే ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ లకోసం ప్రయత్నిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలుండటంతో అక్కడే కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కూడా ఎంపీలు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. చంద్రబాబు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నారు. వచ్చే వారం ఆయన ఢిల్లీ పర్యటన ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల ఢిల్లీ వెళ్లినా...
చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి వచ్చారు. వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా ఆయన అక్కడకు వెళ్లి రాష్ట్రపతి పాలన రాష్ట్రంలో పెట్టాలని డిమాండ్ చేసి వచ్చారు. అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకకపోయినా తర్వాత ఫోన్ చేసి మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. అయితే నేరుగా కలసి ఆయనకు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను వివరించాలని చంద్రబాబు భావిస్తున్నారు.
అన్ని విషయాలను....
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలపై నమోదవుతున్న కేసులు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య, ఇటీవల అసెంబ్లీలో జరిగిన ఘటనలు కేంద్రంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యం. అయితే అపాయింట్ మెంట్ ఎంత వరకూ దొరుకుతుందన్నది ప్రశ్న. అన్ని వైపుల నుంచి చంద్రబాబు మోదీ, షాల అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. దొరికితే మరోసారి ఢిల్లీ వెళతారు. గతంలో మాదిరి అక్కడకు వెళ్లి అపాయింట్ మెంట్ కోసం వేచి చూడకూడదన్నది చంద్రబాబు భావన. మరి మరోసారి చంద్రబాబు ఢిల్లీ టూర్ సక్సెస్ అవుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News