రేవంత్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారా?

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక విష‍యంలో మాత్రం సక్సెస్ అయ్యారు. సీనియర్లను కట్టడి చేయడంలో ఆయన విజయవంతం అయ్యారు

Update: 2022-11-18 08:13 GMT

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక విష‍యంలో మాత్రం సక్సెస్ అయ్యారు. సీనియర్లను కట్టడి చేయడంలో ఆయన కొంత వరకూ విజయవంతం అయ్యారనే చెప్పాలి. ఇప్పుడు హైకమాండ్ దృష్టిలో రేవంత్ కు మంచి మార్కులే పడ్డాయి. సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిపై ఎలాంటి ఫిర్యాదు చేయాలన్నా వెనుకంజ వేస్తున్నారట. రేవంత్ ను ఏదో చేద్దామని అనుకున్న నేతలకు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదంటున్నారు. వచ్చే ఎన్నికలలోపు రేవంత్ ను పీసీసీ చీఫ్ నుంచి తప్పించాలన్న కొందరి నేతల ప్రయత్నాలు బెడిసి కొట్టనున్నాయి.

సీనియర్లు అసంతృప్తి...
తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడం ఎవరికీ ఇష్టం లేదు. సీనియర్ నేతలందరూ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా రాహుల్ గాంధీ ప్రత్యేక చొరవ తీసుకుని రేవంత్ ను చీఫ్ గా ఎంపిక చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కొంత జోష్ పెరిగింది. కార్యకర్తల్లోనూ ఉత్సాహం పెల్లుబుకుతుంది. ప్రధానంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సయితం రేవంత్ కు ఆ పదవి రావడాన్ని ఊహించలేకపోయారని చెబుతారు. రేవంత్ టీఆర్ఎస్ పార్టీపైన, తన కుటుంబంపైనే వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని గులాబీ పార్టీ బాస్ జీర్ణించుకోలేకపోతున్నారు. 

కోమటిరెడ్డి బ్రదర్స్....
ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ రేవంత్ కు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. రేవంత్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా గాంధీ భవన్ లోకి అడుగుపెట్టలేదు. చివరకు ఆయన పార్టీని వీడి వెళ్లిపోయారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో, వీడియోలు బయటపడటంతో హైకమాండ్ వద్ద వెంకటరెడ్డి పరపతి పోయింది. కోమటిరెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా లేనట్లే లెక్క. ఎందుకంటే హైకమాండ్ ఆయన మాట ఇక వినే పరిస్థితి లేదు.

ఉప ఎన్నికల్లో ఓటమి పై...
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలు జరిగాయి. హుజూరాబాద్, మునుగోడుల్లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. దీనిని సాకుగా చూపించి సీనియర్లు కొందరు హైకమాండ్ వద్ద రేవంత్ పై పితూరీలు చెప్పాలని ప్రయత్నాలు ప్రారంభించారని తెలిసింది. అయితే హైకమాండ్ వీటిన్నంటినీ పట్టించుకోవడం లేదు. రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి సీనియర్లు దూరంగా ఉండటాన్ని కూడా హైకమాండ్ గమనించింది. అందుకే సీనియర్లను దూరం పెట్టి నిర్ణయాలను తీసుకునేందుకు రేవంత్ కు హైకమాండ్ నుంచి క్లియరెన్స్ లభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద రేవంత్ కు ఎన్నికలకు ముందు హర్డిల్స్ అన్నీ క్లియర్ అయ్యాయనే చెప్పాలి.
Tags:    

Similar News