గ్యారంటీ కార్డుతో కొట్టేస్తారా?

కర్ణాటక ఎన్నికల ఫలితాలో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో రేసులోకి వచ్చినట్లే

Update: 2023-05-14 02:59 GMT

ఒక్క మాట మాత్రం నిజం. కర్ణాటక ఎన్నికల ఫలితాలో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో రేసులోకి వచ్చినట్లే. నిన్నటి మొన్నటి వరకూ బీఆర్ఎస్‌తో పోటీ పడేది కాంగ్రెస్ పార్టీయా? బీజేపీయా? అన్న సందేహాలు కన్నడ ఫలితాలతో స్పష్టమయ్యాయి. ఇక్కడ బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు మధ్య మాత్రమే ఫైట్ ఉంటుందన్నది యదార్థం. అది బీఆర్ఎస్‌ను ఓడించేంతగా కాంగ్రెస్ నేతలు పార్టీని ఈ ఆరునెలల్లో తీసుకుపోవాల్సి ఉంటుంది. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కొంత పార్టీకి మేలు చేకూరిందనే చెప్పాలి.

ఐక్యత సాధ్యం...
ముఖ్యంగా నేతల మధ్య విభేదాలు ఉండకుండా ఐక్యంగా కొనసాగితే గెలుపు తప్పదని కర్ణాటక ఫలితాలు చాటి చెప్పాయి. ఇక్కడ కూడా నేతలు విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా పోరాడాల్సి ఉంటుంది. పకడ్బందీగా వ్యూహాలు రూపొందించుకోవాలి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ చేసిన ప్రకటన కూడా కొంత తెలంగాణ కాంగ్రెస్‌కు ఊపిరి పోయవచ్చని అంటున్నారు. తాము ప్రకటించిన హామీలను అమలు చేస్తామని, ఐదు గ్యారంటీలను అధికారం చేపట్టిన తొలి నాళ్లలోనే అమలు పరుస్తామని చెపపడం కూడా కాంగ్రెస్‌కు కలసి వచ్చే అంశంగా చెప్పాలి. ఇక్కడ కూడా గ్యారంటీ కార్డును కాంగ్రెస్ నేతలు విడుదల చేసే అవకాశముంది.
హామీలతో ప్రజల్లో...
ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ విడుదల చేసింది. రాహుల్ గాంధీ ఈ డిక్లరేషన్‌ను వరంగల్ సభలో విడుదల చేశారు. నిన్న గాక మొన్న ప్రియాంక యూత్ డిక్లరేషన్ విడుదల చేశారు. దీంతో పాటు అనేక హామీలు ఇచ్చారు. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అంతే కాదు అమరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగాలిస్తామని చెప్పారు. రెండున్నరలక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. అలాగే మల్లు భట్టి విక్రమార్క దళిత ఓటు బ్యాంకును, రెడ్డి సామాజికవర్గాన్ని రేవంత్ రెడ్డి, బీసీ సామాజికవర్గాన్ని వీహెచ్, పొన్నాల వంటి వాళ్లు ఆకట్టుకోగలిగితే కాంగ్రెస్ గెలుపును ఇక్కడ కూడా ఎవరూ ఆపలేరన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
కర్ణాటక వ్యూహాన్ని...
తొమ్మిదేళ్ల అధికార బీఆర్ఎస్‌పై ఉన్న అసంతృప్తిని సరైన రీతిలో క్యాష్ చేసుకోగలిగితే రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టే అవకాశాలను కొట్టిపారేయలేం. అయితే గెలుపు ఊరికే రాదు. ప్రజల్లో ఉండాలి. నిరంతరం వారి సమస్యలపై పోరాడాలి. ప్రధానంగా ఐక్యతగా నేతలు కనిపించాలి. ఒకే మాటపై నిలబడాలి. గ్రూపుల గోలను పక్కనపెట్టాలి. అభ్యర్థుల ఎంపికకు అందరూ సహకరించాలి. ఇవన్నీ జరిగితేనే కాంగ్రెస్‌కు తెలంగాణలో గెలుపు సాధ్యమవుతుంది. అయితే కర్ణాటక తరహా వ్యూహాన్నే పార్టీ హైకమాండ్ తెలంగాణలోనూ అమలు పర్చే అవకాశాలుండటంతో పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.
చేరికలు కూడా...
కాంగ్రెస్ రూరల్ ఏరియాలో బలంగా ఉంది. ఈ సంగతి అందరికీ తెలుసు. బీజేపీ పైన పటారం మాత్రమే. క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేని పార్టీ అది. కర్ణాటక ఫలితాల తర్వాత చేరికలు కూడా కాంగ్రెస్ లోనే ఎక్కువగా ఉండే అవకాశముంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు సయితం కాంగ్రెస్‌లో చేరడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. గాలి జనార్థన్‌రెడ్డి సొంత పార్టీ పెట్టి ఏం సాధించలేదన్న విషయాన్ని కూడా కన్నడ ఫలితాలు రుజువు చేయడంతో ఇక సొంత పార్టీ ప్రతిపాదన అటకెక్కినట్లే. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. అప్పుడే విజయం సాధ్యమవుతుంది.


Tags:    

Similar News