బాబుకు సమయం సరిపోవడం లేదా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కష్టం ఎవరూ పడరు. ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా ఫుల్ టైమ్ పొలిటీషియన్.

Update: 2022-08-20 05:59 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కష్టం ఎవరూ పడరు. ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా ఫుల్ టైమ్ పొలిటీషియన్ రాష్ట్రంలో ఎవరంటే చంద్రబాబు వైపే వేలు చూపించాల్సి ఉంటుంది. మిగిలిన ఎవరైనా కుటుంబానికి కొంత సమయం కేటాయిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం రాజకీయాలు చేయడానికి ఆయనకు 24 గంటలూ సరిపోవనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు అందరూ సమయాన్ని పాలిటిక్స్ కు కేటాయిస్తారు. కానీ అధికారంలో లేనినాడు మాత్రం ఎక్కువ మంది నేతలు ప్రజల్లో ఉండేందుకు ఇష్టపడరు. తమ వ్యక్తిగత జీవితానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎన్నికల సమయం దగ్గరపడే సమయంలో రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తారు.

24 x 7 పాలిటిక్స్..
కానీ చంద్రబాబు అలా కాదు. 24 x 7 పాలిటిక్స్ కే సమయం కేటాయిస్తారు. ఆయనకు రాజకీయం తప్ప వేరే ధ్యాస ఉండదన్నది ఆయనను దగ్గర నుంచి చూసిన వారికి ఎవరికైనా తెలుస్తోంది. ఏడు పదులు వయసు దాటినా చంద్రబాబు ఇప్పటికీ యాక్టివ్ గా ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు రోజుకు 18 గంటల పాటు చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు పేరుంది. ప్రతిపక్ష నేతగా కూడా ఆయన అదే సమయాన్ని కేటాయించడం సొంత పార్టీ నేతలనే అప్పుడప్పుడు ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. జిల్లాల పర్యటన కావచ్చు. సమీక్షలు కావచ్చు. ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో పెట్టేందుకు ఆయన మైండ్ ఎప్పుడూ పాలిటిక్స్ చుట్టూనే తిరుగుతుంటుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన రెండు రోజుల పాటు హైదరాబాద్ నివాసానికి వెళుతున్నారు కాని లేకుంటే పార్టీ ఆఫీసే ఆయనకు ఇల్లులాంటిదని చెప్పాలి.
ఇతర పార్టీలు సయితం...
2024 ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు చంద్రబాబు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇటు పార్టీ నేతలను ఉత్సాహపరుస్తూనే మరో వైపు రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను బేరీజు వేసుకుంటూ వ్యూహాలు రచిస్తున్నారు. ఆయన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే గెలవరన్నది వాస్తవం. కానీ ఆయనతో పొత్తు పెట్టుకుంటే నాలుగు సీట్లు వస్తాయని ఇతర పార్టీలు ఆలోచిస్తాయన్నది కూడా అంతే వాస్తవం. అది బీజేపీ కావచ్చు. కమ్యునిస్టులు కావచ్చు. ఎన్నిసార్లు వారిని వదిలిపెట్టినా చంద్రబాబు ఊ అంటే వారు పొత్తుకు రెడీ అయిపోతుంటారు. ఆయన నాయకత్వంపై ఇతర పార్టీలకు అంత నమ్మకం. ఆ నమ్మకమే చంద్రబాబును రెట్టించిన ఉత్సాహంతో పనిచేయిస్తుందంటారు.
పొలిటికల్ టీచర్....
యువకులు సయితం ఆయన టైం కేటాయించినట్లుగా పాలిటిక్స్ కేటాయించకపోవడం విశేషం. ఆయన కుమారుడు లోకేష్ కూడా అంత సమయం కేటాయించరన్నది కాదనలేని నిజం. అలాంటి చంద్రబాబు కరోనా సమయంలో తప్పించి మిషన్ లా పనిచేస్తున్నారు. పార్టీ నేతలను ఉత్తేజ పరుస్తున్నారు. రోజుకు పది గంటల పాటు కేంద్ర కార్యాలయంలోనే ఉండి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటు ఆరోగ్యం కాపాడుకుంటూ అటు పార్టీని బలోపేతం చేస్తున్న చంద్రబాబు ప్రయత్నాలను ప్రత్యర్థి పార్టీ నేతలు సయితం ప్రశంసించకుండా ఉండలేరు. సరే గెలుపోటములు సహజం. అధికారం కోసం అనే వాళ్లు ఉండవచ్చు. ఎవరైనా అధికారం కోసమే రాజకీయాలు చేస్తారు. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వారే అధికారంలో ఉంటారు. కానీ అధికారంలో లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నించడం చంద్రబాబుకే చెల్లుతుంది. ఈ తరం పొలిటిలకల్ లీడర్లకు చంద్రబాబు పొలిటికల్ టీచర్ అని చెప్పడంలో సందేహం లేదు.


Tags:    

Similar News