ఆ ఇద్దరేనట... నిద్రపట్టనివ్వడం లేదట

చంద్రబాబుకు ఇద్దరూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. సెట్ అవుతుందనుకుంటున్న సమయంలో ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంది.

Update: 2022-01-15 02:58 GMT

చంద్రబాబుకు వారిద్దరూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. సెట్ అవుతుందనుకుంటున్న సమయంలో ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంది. చంద్రబాబుకు ఒక లెక్కంటూ ఉంది. ఆ లెక్క తప్పకూడదన్నదే ఆయన ప్రయత్నం. గత ఎన్నికలలో కాపులు, బీసీలు దూరమయ్యారు. దశాబ్దాలుగా టీడీపీ వెంట ఉన్న బీసీల్లో ఎక్కువ శాతం మందిని జగన్ ఎగురేసుకుపోయాడు. ఈ మూడేళ్లలో జగన్ బీసీలకు పెద్దపీటే వేస్తున్నారు. పదవులు, నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్ట్ పనుల్లో వారికి అగ్రస్థానం కల్పిస్తున్నారు.

బీసీలను...
దీంతో బీసీలను తిరిగి తమవైపునకు తిప్పుకోవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నా అది ఎంతవరకూ ఫలిస్తుందో తెలీదు. బీసీలు గతంలో మాదిరి గంపగుత్తగా మొగ్గు చూపుతారన్న నమ్మకం లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఐదు శాతం ఈబీసీ కోటాలో రిజర్వేషన్లను కల్పిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో బీసీల్లో ఆయన పట్ల వ్యతిరేకత మొదలయింది. తమది బీసీల పార్టీ అని ఎంతగా చెప్పుకున్నా చంద్రబాబును ఈసారి కూడా బీసీలు నమ్మరు.
వైసీపీ వైపు
అదే సమయంలో అధికార వైసీపీపై కాపు సామాజికవర్గం గుర్రుగా ఉంది. తమను పట్టించుకోవడం లేదని వారు భావిస్తున్నారు. మంత్రి పదవులు వంటివి ఇచ్చినప్పటికీ జగన్ కాపులకు చేసిందేమీ లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. అదే సమయంలో కాపులు చంద్రబాబు వెంట కూడా నడిచే అవకాశం లేదు. వారు ఈసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైపు చూసే అవకాశముంది. ఈ నేపథ్యంలో పవన్ ను కలుపుకుని పోయే ప్రయత్నం చంద్రబాబు మొదలు పెట్టారు.
పవన్ ను కలుపుకుని వెళ్లాలన్నా....
కానీ చంద్రబాబుకు ఇప్పుడు కాపు సామాజికవర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం, చిరంజీవి ఇబ్బందిగా మారారు. ముద్రగడ అయితే ఏకంగా ప్రత్యేక పార్టీ పెట్టే అవకాశముందంటున్నారు. అదే జరిగితే కాపు ఓట్లలో చీలిక తప్పదు. ఇక చిరంజీవి కూడా జగన్ ను పొగడటం, జగన్ కూడా చిరంజీవికి ప్రయారిటీ ఇవ్వడం వంటివి టీడీపీని ఇబ్బంది పెడుతున్నాయి. వీరిద్దరి కారణంగా పవన్ కు కూడా కాపులు దూరమవుతారన్న బెంగ పట్టుకుంది. మొత్తం మీద ఈ ఇద్దరూ చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తున్నారు.


Tags:    

Similar News