బాబులో ఆ భయం పోలేదా?

చంద్రబాబు కు రాజకీయంగా భయమెక్కువ. ఆయన ఏ రాజకీయ నిర్ణయమైనా వెంటనే తీసుకోలేరు.

Update: 2022-04-06 07:22 GMT

తెలుగుదేశం పార్టీలో కోవర్టులున్నారు. వారిని ఏరివేస్తాం. పీకి పారేస్తాం. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన వరసగా సమీక్షలు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి మున్సిపాలిటీ తప్ప ఏ ఒక్కదానిలో కనీస ప్రభావాన్ని తెలుగుదేశం పార్టీ చూపకపోవడంతో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకేముంది.. చంద్రబాబు కోవర్టులను గుర్తించి వారి జెండా పీకేస్తారనుకున్నారు. కానీ షరా మామూలే. ఆ సమీక్షలకే చంద్రబాబు వ్యాఖ్యలు పరిమితమయ్యాయి.

రాజకీయ భయం....
చంద్రబాబు కు రాజకీయంగా భయమెక్కువ. ఆయన ఏ రాజకీయ నిర్ణయమైనా వెంటనే తీసుకోలేరు. ఆ సంగతి చంద్రబాబును దగ్గరి నుంచి చూసిన వాళ్లకు తెలుసు. ప్రతి అంశాన్ని నానుస్తూ కాలమే సమాధానం చెబుతుందన్న రీతిలో చంద్రబాబు నిర్ణయాలు ఉంటాయి. అందునా ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ అసలు సాధ్యం కాదు. ప్రతి నాయకుడు అవసరం ఉంటుందని చంద్రబాబు గట్టిగా విశ్వసిస్తారు.
ఏరిపారేస్తానన్నారే?
అందుకు కోవర్టుల ఏరివేత కార్యక్రమాన్ని చంద్రబాబు పక్కన పెట్టినట్లే కన్పిస్తుంది. మున్సిపల్ ఎన్నికల సమీక్ష సందర్భంగా నెల్లూరు ఇద్దరిపైనా, కుప్పంలో కొందరిపైనా చర్యలు తీసుకున్నారు తప్పించి ఎవరిపైనా ఎలాంటి చర్యలు చంద్రబాబు తీసుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కుక్క మూతి పిందెలను ఏరివేస్తానన్న చంద్రబాబు వారికే భయపడుతున్నట్లు అనిపించక మానదు. పార్టీలో ఇప్పటి వరకూ యాక్టివ్ గా లేని నేతలను కూడా చంద్రబాబు చర్యలకు దిగకపోవడం చర్చనీయాంశమైంది.
ఆ ఊసే మరిచిపోయారా....?
ప్రతి నియోజకవర్గం నుంచి కోవర్టుల లిస్టును తెప్పించుకుంటానని చెప్పిన చంద్రబాబు ఆ ఊసే మరిచిపోయారంటున్నారు. గత రెండేళ్లుగా పార్టీకి ఏమాత్రం ఉపయోగపడని నేతలను కూడా చంద్రబాబు పక్కన పెట్టే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇప్పటికీ అధికార పార్టీకి కొందరు వత్తాసు పలుకుతున్నా, వారిపై ఫిర్యాదులు అందుతున్నా చంద్రబాబు మాత్రం పట్టించుకోవడం లేదు. మరి కోవర్టుల ఏరివేత ఎందాక వచ్చిందనేది ఆయనే చెప్పాల్సి ఉంటుంది.



Tags:    

Similar News