కేశినేనినే ఎందుకు ఎంపిక చేశారు?

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలను టీడీపీ అధినేత చంద్రబాబు కేశినేని నానికి అప్పగించారు

Update: 2021-12-23 04:36 GMT

చంద్రబాబు తన రాజకీయ జీవితంలో తొలిసారి డేరింగ్ స్టెప్ వేశారు. ఏ నియోజకవర్గంలోనైనా ఇన్ ఛార్జిని నియమించేందుకు అన్ని కోణాల్లో ఆలోచించే చంద్రబాబు ఈ విషయంలో మాత్రం ఎటువంటి ఆలోచనలు చేయలేదు. ఆయన కేశినేని నానిని నమ్ముకున్నారు. తెలుగుదేశం పార్టీలో అక్కడ బలమైన నేతలున్నా వారిని కాదని కేశినేనికి అప్పగించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మొన్నటి వరకూ....
కేశినేని నాని మొన్నటి వరకూ అసంతృప్తితో ఉన్నారు. తనకు ప్రాధాన్యత దక్కడం లేదని అలిగారు కూడా. కొంత కాలం పాటు ఆయన చంద్రబాబును కూడా కలవడానికి ఇష్టపడటం లేదు. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తనపై బొండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నది కేశినేని కోపం. దీంతో వచ్చే ఎన్నికల్లో తాను విజయవాడ పార్లమెంటుకు పోటీ చేయనని కూడా చెప్పి వచ్చేశారు.
అప్పటి నుంచే....
తర్వాత చంద్రబాబు 36 గంటల దీక్ష సమయంలో తన వద్దకు వచ్చిన కేశినేని నానితో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అప్పటి నుంచి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లోనూ కేశినేని నాని పార్టీ పట్ల చూపిన నిబద్ధతను కూడా చంద్రబాబు పరిగణనలోకి తీసుకున్నారు. బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలను కాదని పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలను చంద్రబాబు కేశినేని నానికి అప్పగించారు. ఆ నియోజకవర్గంలో డివిజన్ ఇన్ ఛార్జుల నియామకం కూడా కేశినేని నాని చేస్తారు. దీంతో బుద్దావెంకన్న వర్గం భగ్గుమంటుంది. దీనిని వ్యతిరేకించాలని ఆయనపై వత్తిడి తెస్తోంది.
వారికి వేరే దారిలేదు....
కానీ చంద్రబాబు ఆలోచన ఏంటంటే బుద్దా వెంకన్న తన వీర భక్తుడని నమ్మకం. తనను వదలి వెళ్లరన్న విశ్వాసం ఉంది. వారికి వేరే పదవులు ఉండటంతో ఈ బాధ్యతలను చంద్రబాబు కేశినేని నానికి అప్పగించారని టీడీపీలో కొందరు అంటున్నారు. కానీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో బలంగా ఉన్న బుద్దా వెంకన్న, నాగులు మీరాలు కేశినేని నానికి సహకరించే అవకాశమే లేదన్న కామెంట్స్ కూడా విన్పిస్తున్నాయి. మొత్తం మీద తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారిని కేశినేని ఇలా దెబ్బకొట్టారన్నది వాస్తవం. గెలుపు అనేదే లేని నియోజకవర్గంలో టీడీపీకి కేశినేని ఎంపిక పార్టీని ఎంతమేరకు ముందుకు తీసుకెళుతుందో చూడాలి.


Tags:    

Similar News