ఓడిపోతారని కాదు కానీ... ఆ టెన్షన్ తప్పదా?

టీడీపీ అధినేత చంద్రబాబు ఒక విషయంలో క్లారిటీ ఇచ్చారు. తాను వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు

Update: 2022-01-08 03:20 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒక విషయంలో క్లారిటీ ఇచ్చారు. తాను వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో ఆశ్చర్యపడాల్సిన పనిలేకపోయినా కొంత ఇబ్బందులు మాత్రం తప్పవు. ఇబ్బందులు కాదు కాని చంద్రబాబు స్వయంగా కొంత టెన్షన్ కు లోనుకాక తప్పదు. అలాగని కుప్పం నియోజకవర్గం వదలి వెళ్లి వేేరే చోట పోటీ చేయడం కూడా చంద్రబాబు వంటి సీనియర్ నేతకు సరికాదు.

ఏడుసార్లు వరసగా....
కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు కంచుకోట. 1989 నుంచి ఇప్పటి వరకూ చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల వరకూ ఇప్పటి వరకూ ఏడుసార్లు చంద్రబాబు విజయం సాధించారు. ఎనిమిదో సారి గెలవరని ఎవరూ చెప్పలేరు. వైసీపీ నేతలు ఓడిస్తామని శపథాలు చేస్తున్నా చంద్రబాబును కుప్పం నియోజకవర్గంలో ఓడించడం అంత సులువు కాదు. గత ఎన్నికల్లో మెజారిటీ తగ్గి ఉండవచ్చు. అంత మాత్రాన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతను కుప్పం ప్రజలు ఓడించుకుంటారంటే నమ్మశక్యం కాదు.
పూర్తిగా వారిపైనే....
కాకుంటే ఒకటి మాత్రం నిజం. చంద్రబాబు కొంత కుప్పం పై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఇది వరకు మాదిరిగా కుప్పం నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానంటే కుదరదు. అక్కడ టీడీపీ నేతలపై చంద్రబాబుకు ఇప్పటికే నమ్మకం సన్నగిల్లింది. వారు ప్రత్యర్థులకు సహకరిస్తున్నారన్న సంగతి తెలిసిపోయింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమయిపోయింది. అందుకే కుప్పంలో తనకు నమ్మకమైన వారిని నియమించుకోవాల్సి ఉంది.
వైసీపీ బలం పెంచుకున్నా.....
అంతేకాదు వైసీపీ ఇక్కడ కొద్దోగోప్పో గతం కన్నా బలం పెంచుకుందనే చెప్పాలి. కుప్పం పై ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్ ఇన్ ఛార్జిగా భరత్ ను నియమించడమే కాకుండా ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. కుప్పంలో క్షేత్రస్థాయిలో ఇప్పుడు వైసీపీ కొంత బలం పెంచుకుందనే చెప్పాలి. అయినా అది చంద్రబాబును ఓడించే స్థాయిలో ఉందా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి. అయినా ఈసారి చంద్రబాబు మాత్రం కుప్పంలో కొంత టెన్షన్ పడాల్సి ఉంటుంది. తమ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తూనే కుప్పంపైన కూడా ఒక కన్నేయక తప్పదు.


Tags:    

Similar News