ఇక ఏపీలోనూ జంప్ లు తప్పవా?

డీపీ, జనసేనలు కలిస్తే కొంత గెలుపునకు అవకాశాలున్న చోట్ల నేతలు పార్టీలు మారే అవకాశముందని తెలిసింది.

Update: 2022-10-24 04:12 GMT

నిన్న మొన్నటి వరకూ ఒక డౌట్ ఉండేది. పవన్ కల్యాణ్ టీడీపీతో కలసి నడుస్తారా? లేదో? అన్న అనుమానం ఉండేది. అయితే ఆ అనుమనాలన్నీ పటాపంచాలయి పోయాయి. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక క్లారిటీ వచ్చింది. టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తాయని నేతలు గట్టిగా నమ్ముతున్నారు. టీడీపీ, జనసేనలు కలిస్తే కొంత గెలుపునకు అవకాశాలున్న చోట్ల నేతలు పార్టీలు మారే అవకాశముందని తెలిసింది. కొందరు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు సంపాదించుకోవడం కోసం, మరికొందరు ఆ నియోజకవర్గాల్లో తాము కీలకంగా మారేందుకు ముందుగానే పార్టీలు మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది.

కొన్ని నియోజకవర్గాల్లో....
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పొత్తుల కోసమే ముందు నుంచి కొన్ని నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించలేదు. మిత్రపక్షాలకు వదిలిపెట్టాల్సిన స్థానాలను చంద్రబాబు ముందుగానే గుర్తించినట్లు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఖచ్చితంగా టీడీపీ పోటీ చేసే స్థానాలకు సంబంధించి మాత్రమే ఆయన నిన్న మొన్నటి వరకూ సమీక్షలు చేశారు. మిత్రపక్షాలు కొంత బలంగా ఉన్న ప్రాంతాలను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదన్న చర్చ టీడీపీలో నడుస్తుంది. అయితే ఇప్పుడు టీడీపీలో చేరి టిక్కెట్ పొందడమా? జనసేనలో చేరి టిక్కెట్ సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడమా? అన్న ఆలోచనలో కొందరు నేతలున్నారని తెలిసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో...
స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల జనసేన, టీడీపీ అనధికారికంగా పొత్తు కుదుర్చుకుంది. కొన్ని స్థానాలను దక్కించుకుంది. ఎన్నికలకు ముందే కొన్ని స్థానాల్లో, అనంతరం మరికొన్ని చోట్ల పొత్తు కుదుర్చుకుని కొన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధానంగా పవన్ కల్యాణ్ తో జట్టు కుదుర్చుకుంటే యువత, కాపు సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా పడతాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే ఒకసారి తాము నియోజకవర్గాన్ని మిత్రపక్షాలకు వదులుకుంటే పట్టు కోల్పోతామని భావించిన నేతలు అవసరమైతే జనసేనలో చేరయినా టిక్కెట్ సాధించాలన్న యత్నంలో ఉన్నారని సమాచారం.
మంత్రి పదవుల కోసం...
ప్రధానంగా పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ జంప్ లు ఎక్కువగా ఉంటాయని తెలిసింది. నేతలు మరో ఆలోచన కూడా చేస్తున్నారు. జనసేన, టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి వర్గంలో లెక్కలు కూడా వేసుకుంటున్నారు. టీడీపీలో ఉంటే మంత్రి పదవులు దక్కవని భావించిన కొందరు నేతలు జనసేనలోకి వెళ్లి పోటీ చేసి గెలిచి మంత్రి అయి తమ కలను నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. అందులో సీనియర్ నేతలు కూడా ఉన్నారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కు టచ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకే త్వరలోనే జనసేనలోకి భారీగా చేరికలు ఉంటాయని చెబుతున్నారు. టీడీపీ, కాంగ్రెస్ అక్కడక్కడ వైసీపీ నుంచి కూడా నేతలు ఆ పార్టీని వీడి జనసేనలో చేరే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఇందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.
Tags:    

Similar News