స్టాలిన్ శాసిస్తాడు.. అంతే

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేడు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

Update: 2023-03-01 04:32 GMT

అతను ఆశలు కోల్పోలేదు. అధికారం ఎప్పటికైనా దక్కుతుందన్న నమ్మకమే అతడిని నాయకుడిగా మలచింది. తండ్రి మరణం తర్వాత కూడా ఒంటిచేత్తో ఎన్నికలకు వెళ్లి గెలిపించిన చరిత్ర ఆయనది. యువకుడేం కాదు. ఏడు పదుల వయసు. డెబ్బయి ఏళ్ల వయసులోనూ యువకుడిలా కనిపించే ఎంకే స్టాలిన్ నేడు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ముందుగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలి. తమిళనాడు రాజకీయాలను గతంలో పరిశీలిస్తే అసలు స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారా? అన్న సందేహం కూడా అందరిలోనూ కలిగింది. తండ్రి చాటు బిడ్డగా ఎదిగిన స్టాలిన్ పార్టీని ఎలా నడపగలరన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.


14 ఏళ్లకే రాజకీయాల్లోకి...

స్టాలిన్ ను ముఖ్యమంత్రి పదవి ఆషామాషీగా దక్కలేదు. 14 ఏళ్లలో రాజకీయాల్లోకి వచ్చినా1996లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లు లెక్క. అంతకు ముందు వరకూ తండ్రి కరుణానిధికి చేదోడు వాదోడుగా నిలిచే వారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా షాడో సీఎంగా వ్యవహరించలేదు. 1996లో ఆయన చెన్నై మేయర్ పదవిని చేపట్టారు. 2002 వరకూ ఆయన మేయర్ గానే పనిచేశారు. అనంతరం 2009లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వమే ఆయనకు నేతలను దగ్గరగా చేర్చింది. తొలినాళ్లలో తన తండ్రి కరుణానిధికి ఉన్నంత లౌక్యం, రాజకీయ వ్యూహాలు తెలియకపోయినా సీనియర్లను గౌరవిస్తూ రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నారంటారు.
ఆటుపోట్లు ఎదురైనా...
తండ్రి మరణం తర్వాత ఎన్నో ఆటుపోట్లు. సొంత ఇంట్లోనే కలహాలు. సోదరుడితో విభేదాలు. ఇంకేముంది స్టాలిన్ ను సోదరుడు ఆళగిరి ముఖ్యమంత్రి కానివ్వడన్న మాట చాలా మంది నోట విన్నాం. కరుణానిధి మూడో కుమారుడిగా పుట్టినా రాజకీయాల్లో తనకు తిరుగులేదని అనిపించుకున్నారు. ఇటు కేంద్రంలో అధికార పార్టీతో ఘర్షణ. అయినా ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచాడు. కోలుకోలేని కాంగ్రెస్ పక్షానే ఆయన నిలిచాడు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న అన్నాడీఎంకేను ఎదుర్కొన్నారు. అధికారం కోసం పాదయాత్ర చేయలేదు. ప్రజల్లోకి వెళ్లి తాను వస్తే ఏం చేయగలనో చెప్పుకున్నారు. అంతే తప్ప ఎలాంటి హడావిడి చేయలేదు. 

సంక్షేమ పథకాల అమలుతో...
అదే సమయంలో అధికారంలోకి వస్తే ఆయన పనితీరు ఎలా ఉంటుందోనని అందరూ అనుమానంగా చూసిన వారే. అయినా స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడులో ఎన్నో మార్పులు. 2021లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కక్ష పూరిత రాజకీయాలకు కాలం చెల్లిందని సంకేతాలు పంపారు. అంతే కాదు తమ చిరకాల ప్రత్యర్థి జయలలిత పెట్టిన పథకాలను కూడా కొనసాగించారు. అంతేకాదు అభివృద్ధి తప్ప మరో ధ్యాస లేకుండా ఉన్నారు. వివాదాల జోలికి ఇంతవరకూ వెళ్లలేదు. తమిళనాడు ప్రయోజనాలను తాకట్టు పెట్టే ఏ చర్యను కూడా ఒప్పుకునే నైజం కాదు. గవర్నర్ తో బేధాభిప్రాయాలున్నా అన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల్లో అమలయ్యే మంచి పథకాలను తమిళనాడుకు తెచ్చేందుకు ఏమాత్రం సిగ్గుపడరు. అదీ స్టాలిన్. నిజంగా చెప్పాలంటే... నాడు కరుణానిధి... జయలలిత పాలన కంటే మెరుగైన పాలన అందిస్తున్నారన్నది విమర్శకులు సయితం అంగీకరిస్తున్న విషయం. హ్యాపీ బర్త్‌డే స్టాలిన్ సర్.


Tags:    

Similar News