ఇక సుప్రీం కోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం..!

Update: 2018-09-26 09:44 GMT

సుప్రీంకోర్టులో జరిగే వాదనలను ప్రజలకు తెలిసేలా లైవ్ టెలికాస్టింగ్ చేయాలంటూ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్, ఇతరులు వేసిన పిటిషన్‌ సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. కోర్టులో జరిగే వాదనలు లైవ్ టెలికాస్ట్ చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు ఈ విధానానికి ఓకే చెబితే పార్లమెంటు సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న లోక్ సభ, రాజ్యసభ టీవీల్లాగా, కోర్టులో జరిగే వాదనలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఒక ప్రత్యేక ఛానెల్‌ను పెడతామని కేంద్రం సమాధానంగా చెప్పింది. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రజలకు న్యాయవ్యవస్థ మరింత చేరువవుతుందని ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అభిప్రాయపడ్డారు. అంతేకాదు కేసుకు సంబంధించిన వాదనలు ఎలా జరిగాయన్నదానిపై కూడా కేసుతో సంబంధం ఉన్న వారికి స్పష్టత రావడమే కాక, పారదర్శకత కూడా ఉంటుందని జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు.

సున్నితమైన కేసులకు మినహాయింపు...

అయితే కొన్ని సున్నితమైన కేసులకు మినహాయింపు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. అంటే అత్యాచార ఘటనలు, వివాహానికి సంబంధించిన కేసులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. లైవ్ టెలికాస్టింగ్ ముందుగా ఛీఫ్ జస్టిస్ కోర్టు నుంచి ప్రారంభించి ఆ తర్వాత చిన్నగా ఇతర కోర్టులకు కూడా వర్తింపజేస్తామని కేంద్రం తరపున వాదించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ చెప్పారు. కోర్టులో వాదనలు ప్రజలు తెలుసుకోవాలని చెబుతూ అందుకు లైవ్ టెలికాస్టింగ్ పద్ధతిని అవలంభించాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లోక్ సభ, రాజ్యసభ సమావేశాలు 2003, 2004 నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల అందులో ఏమి జరుగుతోందో... తమ ఎంపీలు ఎలా మాట్లాడుతున్నారో ప్రజలకు అవగాహన వచ్చిందని తద్వారా పార్లమెంటరీ ప్రొసీడింగ్స్‌ లో పారదర్శకత కనిపించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Similar News