బాబు లో పెరిగిన ఆశలు.. అందుకేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కొంత ఆశలు పెరిగాయి.

Update: 2021-11-25 06:47 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కొంత ఆశలు పెరిగాయి. తెలంగాణలో అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అక్కడి పార్టీని ఎన్నికల్లో గెలిపించలేకపోవడంతో ఇక్కడా వైసీపీకి అదే పరిస్థితి ఉంటుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ చంద్రబాబు జగన్ విషయంలో భయపడింది సంక్షేమ పథకాలను చూసే. జగన్ ను చేతకాని ముఖ్యమంత్రిగా పెద్దయెత్తున చంద్రబాబ ప్రచారం చేశారు. అభివృద్ధి లేదని, అప్పులు పెరిగాయని విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో అసెంబ్లీలో జరిగిన సంఘటనను సానుభూతిగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటిస్తూ తన సీనియారిటీని, సిన్సియారిటీని గుర్తు చేస్తున్నారు.

అదే బెంగ...
ఇదే సమయంలో సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబుకు కొంత బెంగ ఉంది. తాను ఏం చెప్పినా, ఏం హామీలు ఇచ్చినా ఇప్పుడు జనం నమ్మే పరిస్థితి లేదు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో లోపాలను ఎత్తి చూపాలన్నదే ఆయన నిన్న మొన్నటి వరకూ ఆలోచన. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలతో సంక్షేమ పథకాలపై క్లారిటీ వచ్చింది. జగన్ తాడేపల్లి దాటకుండా వెల్ఫేర్ స్కీమ్ లను అమలు చేస్తూ ఉండాలనే చంద్రబాబు కోరుకుంటున్నారు.
ఎంత శ్రమించినా...?
జగన్ ఈ మూడేళ్ల పాటు ఎంత శ్రమించినా ఫలితం ఉండదన్న అంచనాలో ఉన్నారు. ఫస్ట్ ఇంప్రెషన్ లోనే జగన్ డెవెలెప్ మెంట్ పై నెగిటివ్ తెచ్చుకున్నారని, ఇక ఎంత చేసినా జగన్ కు ప్రయోజనం ఉండదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు పార్టీని మరింత బలోపేతం చేయడమే కాకుండా సరైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటే ఈసారి విజయం ఖాయమని చంద్రబాబు సీనియర్ నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
భయపడాల్సిన పనిలేదట....
మ్యానిఫేస్టోలో కూడా సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే తాము అధికారంలోకి వస్తే ఏ యే రంగాలను డెవలెప్ చేస్తామో చెబుదామని, అప్పుడే ప్రజలు విశ్వసిస్తారంటున్నారు. అలివి కాని హామీలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ పథకాలు తీసుకున్న అందరూ జగన్ కే ఓటేస్తారని భయపడాల్సిన అవసరం లేదని కూడా చంద్రబాబు సీనియర్ నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మొత్తం మీద హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఇటీవల అసెంబ్లీలో జరిగిన ఘటన చంద్రబాబులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అంతే కాదు వరద సమయంలో ప్రాణ నష్టాన్ని అరికట్టడంలో జగన్ విఫలమయ్యారని, తిత్లీలో 16 మంది, హుద్ హుద్ లో 17 మంది మాత్రమే చనిపోయారని, అది తన పరిపాలన దక్షతకు నిదర్శనమని చంద్రబాబు చెబుతున్నారు.


Tags:    

Similar News