రేవంత్ రూట్ మ్యాప్... ఆ దారి కరెక్టేనా?

కాంగ్రెస్ లో వరస చేరికలు మరింత ఊపు తెస్తున్నాయి. గత రెండు నెలలుగా కాంగ్రెస్ లో మంచి జోష్ కన్పిస్తుంది.

Update: 2022-06-25 05:23 GMT

కాంగ్రెస్ లో వరస చేరికలు మరింత ఊపు తెస్తున్నాయి. గత రెండు నెలలుగా కాంగ్రెస్ లో మంచి జోష్ కన్పిస్తుంది. ఎన్నికల ముందు చేరికలు పార్టీకి ఎంతో ఊపు తెస్తాయి. జనాల ఆలోచనల్లోనూ మార్పు తెస్తుంది. నేతల చేరికల వల్ల పార్టీ కార్యకర్తల్లో కూడా జోష్ పెరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో అదే జరుగుతుంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత పెద్దగా చేరికలు లేవు. అయితే గత నెల రోజుల నుంచి వరస చేరికలు జరుగుతున్నాయి. రేవంత్ ప్రధానంగా చేరికలపైనే దృష్టి పెట్టినట్లు కనపడుతుంది.

వరస చేరికలతో...
తెలంగాణలో ఇటీవల రాహుల్ గాంధీ టూర్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన సతీమణి మంచిర్యాల జడ్పీ ఛైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి కాంగ్రెస్ లో చేరిపోయారు. టీఆర్ఎస్ కార్పొరేటర్, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు వరసగా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి అయితే ఖమ్మం జిల్లాలో సునామీ పుడుతుందని హెచ్చరిస్తున్నారు.
బీజేపీని మించి...
ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో బీజేపీలో చేరికలు లేవు. ఆ పార్టీ కొంత దూకుడుగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో చేరితే విలువ ఉండదని భావించే కాంగ్రెస్ ను నేతలు ఆశ్రయిస్తున్నట్లు కనపడుతుంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కు ఉన్న ఓటు బ్యాంకులో కొంత కూడా బీజేపీకి లేకపోవడం, ఆ పార్టీ కొన్ని నియోజకవర్గాలకే పరిమితం కావడం వంటి కారణాలు కూడా కాంగ్రెస్ లో చేరికలకు కారణంగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో 100కు పైగా నియోజకవర్గాల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోయిన సంగతిని గుర్తు చేస్తున్నారు.
రేవంత్ గ్రౌండ్ వర్క్...
రేవంత్ ఇటీవల దూకుడు పెంచారు. అసలే స్పీడ్ ఉన్న నేత కావడం, కేసీఆర్ కు ధీటైన నాయకుడిగా ప్రొజెక్ట్ అయ్యారు. దీంతో పాటు రేవంత్ గత కొంతకాలంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అసంతృప్త నేతలతో మాట్లాడుతున్నారు. టిక్కెట్ హమీ ఇవ్వకపోయినా వారి రాజకీయ భవిష్యత్ కు రేవంత్ ను భరోసా ఇస్తున్నారట. త్వరలో కీలక నేతలు కాంగ్రెస్ లో చేరతారన్న టాక్ వినిపిస్తుంది. టీఆర్ఎస్, బీజేపీ నుంచి కూడా వలసలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ లో గతంలో ఎన్నడూ లేనంత జోష్ కనపడుతుంది. బీజేపీని వెనక్కు నెట్టి కాంగ్రెస్ ను ముందుకు తేవడంలో రేవంత్ వ్యూహం ఫలిస్తుందన్న నమ్మకం క్యాడర్ లో ఏర్పాడిందనే చెప్పాలి.


Tags:    

Similar News