అయ్యో పునుగుపిల్లి.. రోడ్డు ప్రమాదంలో మృతి

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేకంలో పునుగుపిల్లి తైలాన్ని వినియోగిస్తారని తెలిసిందే.

Update: 2022-05-16 03:39 GMT

హైదరాబాద్ : అంతరించిపోతున్న ఎంతో అరుదైన జాతికి చెందిన పునుగు పిల్లి మరణించింది. అట్లూరు మండలం అటవీప్రాంతానికి అతి సమీపంలో ఓ పునుగు పిల్లి రోడ్డుపై మరణించి ఉండడాన్ని గమనించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆ పునుగుపిల్లి తల భాగాన దెబ్బ తగలడంతో అది కాస్తా మృతి చెందింది. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ సిబ్బంది వచ్చి పునుగు పిల్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సిద్ధవటం రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కు సమాచారమిచ్చింది ఫారెస్ట్ సిబ్బంది.

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేకంలో పునుగుపిల్లి తైలాన్ని వినియోగిస్తారని తెలిసిందే. పునుగు పిల్లులను తిరుమలలోని గోశాలలో పెంచుతున్నారు. పునుగుపిల్లి శరీరం నుంచి తైలం తీస్తారు. ఇనుప జల్లెడలో పునుగు పిల్లిని ఉంచుతారు. అందులో చందనపుకర్రను నిలబెడతారు. ప్రతి పది రోజులకు ఒకసారి పునుగు పిల్లి శరీర గ్రంథుల ద్వారా చెమటను విసర్జిస్తుంది. అది దాని శరీరంపై కొద్దిగా అట్టకడుతుంది. తర్వాత పునుగు పిల్లి జల్లెడలో నిలబెట్టిన చందనపు కర్రకు తన శరీరాన్ని రుద్దుకుంటుంది. ఇలా చేయడంతో దాని శరీరంపై చెమట ద్వారా వచ్చినదంతా కర్రకు బంకలా అంటుతుంది. శరీరంలోని గ్రంథుల ద్వారా వచ్చే చెమట ఆరిపోయాక తైలంలా అట్టకడుతుంది. ఇది సుగంధభరిత పరిమళాన్ని వెదజల్లుతుంది. తైలాన్ని తీసి ప్రతి శుక్రవారం అభిషేకం అనంతరం వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూస్తారు. తిరుమలేశుడి సేవకు ఈ తైలాన్ని వినియోగిస్తారు. పునుగు పిల్లులు అంతరించిపోతుడంటంతో టీటీడీ ప్రత్యేకంగా వీటిని పెంచుతోంది. పునుగుపిల్లి మన దేశంతోపాటు శ్రీలంక, మయన్మార్, భూటాన్, సింగపూర్‌లలో మాత్రమే కనిపిస్తుంది.


Tags:    

Similar News