ఏందయ్యా ఈ రచ్చ...?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వీధిన పడ్డాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే రాజకీయ రచ్చ మొదలయింది.

Update: 2022-10-16 07:37 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వీధిన పడ్డాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే రాజకీయ రచ్చ మొదలయింది. ఎవరి జెండా వారిది. ఎవరి అజెండా వారిది. అంతవరకూ పరిమితమయితే ఓకే. కాని వ్యక్తిగత విమర్శలు చేయడంతోనే ఈ రభస మొదలవుతుంది. ముఖ్యంగా నిన్న విశాఖలో జరిగిన గర్జనలో మంత్రులు, మాజీ మంత్రులు కొందరు మాట్లాడిన తీరు అభ్యంతరకరమే. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయం, చంద్రబాబు, లోకేష్ పై మాజీ మంత్రులు వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీంతో విశాఖ వేదికగా రాజకీయం మరోసారి రగడ అయింది.

ఎవరి నినాదం వారిది...
ఎవరి నినాదం వారు చేసుకోవచ్చు. ఒకరు మూడు రాజధానులంటే మరొకరు ఏకైక రాజధానిగా చెప్పుకోవచ్చు. రేపు ఎన్నికలలో ప్రజలు అంతిమంగా తీర్పు చెబుతారు. ఏ ప్రాంతం ఆ ప్రాంతంలోనే తమ డిమాండ్ ను ఓటు రూపంలో తెలియజేస్తారు. తర్వాత వచ్చే ప్రభుత్వం దానిని అమలు చేయవచ్చు. లేకుంటే లేకపోవచ్చు. కానీ విశాఖ పరిపాలన రాజధాని కావాలంటూ జేఏసీ గర్జన చేపట్టిన రోజునే ఇతర పార్టీలు కూడా సమావేశాలు పెట్టాయి. జనసేన తాము మూడు నెలలకు ముందే జనవాణి కార్యక్రమాన్ని ఖరారు చేశామని ఇప్పుడు చెబుతుంది. టీడీపీ విశాఖ అభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది.
ఒకరినొకరు రెచ్చగొట్టే విధంగా...
ఇలా ఒకరినొకరు రెచ్చగొట్టే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించడంతో క్యాడర్ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై దాడి జరిగిందని చెబుతున్నారు. జరగలేదని జనసేన చెబుతుంది. దీంతో అనేక మంది జనసేన నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. వీరి భవి‌ష్యత్ ఏంటి? పోలీసు కేసుల్లో ఇరుక్కున్న నేతలకు, కార్యకర్తల కుటుంబాలకు ఈ రాజకీయ పార్టీలు ఏం సమాధానాలు చెబుతాయి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. న్యాయవాదులను పెట్టి బెయిల్ తీసుకుని బయటకు రావచ్చు. కానీ ఆ యువకులు భవిష్యత్ గురించి రాజకీయ పార్టీలు ఆలోచించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇబ్బంది పడేది...
ఈ రాజకీయ పార్టీల నిర్వాకం వల్ల ఇబ్బంది పడేది సామాన్య ప్రజానికమే. నిన్న విమానాశ్రయం నుంచి వెళ్లేవారు దాదాపు 30 మంది ఫ్లైట్ మిస్ అయ్యారు. విమానం దిగిన వారు ఇంటికి వెళ్లడానికి కొన్ని గంటల సమయం పట్టింది. మరోవైపు పవన్ వంటి చరి‌ష్మా కలిగిన నేత విశాఖకు వస్తుంటే పోలీసులు సరైన భద్రత కల్పించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ర్యాలీలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం కూడా రాజకీయ పార్టీలకు సరికాదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మూడు రాజధానులు కాదు.. మూడు పార్టీలదీ మొండితనమే. ఎవరికీ ఎవరు తగ్గరు. ఫలితం వచ్చే ఎన్నికల వరకూ ఏపీలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. పార్టీ అభిమానులు అరెస్ట్ అవుతూనే ఉంటారు. ఈ సంస్కృతి ఇక కొనసాగుతూనే ఉంటుంది.


Tags:    

Similar News