ఎన్నికలకు సిద్ధం.. జనసేన జెండా ఎగురవేస్తాం

ఏపీ భవిష్యత్ కు వైసీపీ హానికరమని, పోలీసులు వ్యవస్థల కోసం పనిచేయాలని, రాజకీయ నేతలకోసం కాదని పవన్ కల్యాణ్ అన్నారు

Update: 2022-07-16 14:09 GMT

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని తమ పార్టీ స్వాగతించిందని జనసేన అధినేతప పవన్ కల్యాణ్ అన్నారు. . కానీ దానిని కూడా వైసీపీ కులు రాజకీయం చేసిందన్నారు. మండపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జాతీయ రాజకీయనేతలకు కులాలు అంటగట్టకూడదని మండపేటలో తీర్మానం చేసుకుందామన్నారు. కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ముద్దుల మామయ్యను మళ్లీ ఆదరిస్తారా? అని పవన్ ప్రశ్నించారు. పాదయాత్ర కుర్చీ కోసమే చేశారని, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి కాదని పవన్ అన్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన జగన్ ఇప్పుడు హెలికాప్టర్ లోనే ఎందుకు తిరుగుతున్నారని నిలదీశారు. ఈ ప్రభుత్వమే కావాలా? జనసేన కావాలా? అన్నది మీరే తేల్చుకోవాలని పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు. జేబుల్లోంచి డబ్బులు తీసివ్వడం జనసేకు సరదా కాదని, ప్రజల సమస్యలను పది మందికి తెలిసేలా గళం విప్పుతున్నామని చెప్పారు.

ఇక్కడ కులాలే...
తిరుగుబాటు ధోరణి లేకపోతే అరాచకవాదమే రాజ్యమేలుతుందన్నారు. అంబేద్కర్ కూడా తొలిసారి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారన్నారు. జనసేన ప్రభుత్వం వచ్చినా ప్రజలు ప్రభుత్వం క్రమశిక్షణలో పెట్టాలన్నారు. ఎవరైనా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలని అభిప్రాయపడ్డారు. మార్పు గోదావరి జిల్లాల నుంచి మొదలవుతుందని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు దొరకక ఇబ్బందులు పెడుతున్నారన్నారు. జనసేన అధికారంలోకి వస్తే పంచాయతీ నిధులు గ్రామాలకే ఇస్తామని తెలిపారు. 2024 లో జనసేన జెండా ఎగురవేయడం ఖాయమని చెప్పారు. తెలంగాణలో నా తెలంగాణ అనే భావన ఉందని, ఆంధ్రలో మాత్రం కులాలను గౌరవిస్తారని అన్నారు. వచ్చే ఎన్నికలకు జనసేన సిద్ధమని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
వైసీపీ హానికరం...
జనసేన అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు పది లక్షల రుణం ఇస్తామని పవన్ కల్యాణ‌్ అన్నారు. అక్టోబరు నుంచి ప్రజల్లోకి వస్తానని తెలిపారు. అప్పుడే తాము ఏం చేయబోతున్నామో చెబుతానని పవన్ కల్యాణ్ తెలిపారు. గోదావరి వరదలలో బాధితులను జనసైనికులు ఆదుకోవాలని పవన్ కోరారు. వైసీపీ నేతలంటే ఎందుకు భయపడుతున్నారన్నారు. 99 సార్లు వారి ఆగడాలను భరిస్తామని, తర్వాత తాటతీస్తామని వైసీపీ నేతలను హెచ్చరించారు. జనసేన తెలుగు ప్రజల ఐక్యత కోరుకుంటుందన్నారు. మరోసారి వైసీపీ వస్తే ఏపీ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఆలోచించుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. వైసీపీ లేని రాష్ట్ర ప్రభుత్వం చూడాలనుకుంటున్నానని చెప్పారు. ఏపీ భవిష్యత్ కు వైసీపీ హానికరమన్నారు. పోలీసులు వ్యవస్థల కోసం పనిచేయాలని, రాజకీయ నేతలకోసం కాదని పవన్ అన్నారు.
విలీనం ప్రసక్తే లేదు...
అన్యాయం జరిగితే ఎదురు తిరగాలని పవన్ పిలుపునిచ్చారు. శ్రీలంకలో బలమైన అధ్యక్ష కుటుంబం ప్రజల తిరుగుబాటుతో పరారరయిందన్నారు. జనం ఎదురు తిరిగితే ఏ రాజకీయ నేత సరిపోడన్నారు. నాయకులకు టిక్కెట్లు ఇచ్చినా వారిని చూడకుండా వారిలో పవన్ కల్యాణ్ చూడమని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉభయగోదావరి జిల్లా నుంచి మార్పు మొదలయితే పులి వెందుల వరకూ వెళుతుందన్నారు. మార్పు కోసమే జనసేన వచ్చిందన్నారు. జనసేన మాయమాటలు చెప్పడం లేదన్నారు. ఇవ్వడమే తప్ప తనకు తీసుకోవడం తెలియదన్నారు. అందుకే ఓట్లు అడగేందుకు కూడా తనకు సిగ్గుగా ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని కాపాడేది జనసేన మాత్రమేనని ఆయన అన్నారు. రాజకీయంగా దశాబ్దంగా చూస్తున్నానని, ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నానని తెలిపారు. జనసేన పార్టీని ఎందులో విలీనం చేసే ప్రసక్తి లేదని తెలిపారు.


Tags:    

Similar News