పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం పర్యాటకుల భద్రత విషయం మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. గత సంవత్సరం నవంబరులో విజయవాడలో పడవ ప్రమాదం సమయంలో ఇకనుంచి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్న పర్యాటక శాఖ మాటలు కేవలం నీటిమూటలు గానే మిగిలిపోయాయి. వాస్తవానికి గత సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకుని పడవ ప్రమాదాలు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులు, పర్యాటక శాఖపై ఉంది. కానీ, ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్రంగా స్పందించి, హడావుడి చేసే యంత్రాంగం మరోసారి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు. ఇందుకు శుక్రవారం పాపికొండల విహారయాత్రలో జరిగిన ప్రమాదమే ఉదాహరణ. సుమారు 80 మంది యాత్రికులతో వెళ్తున్న పడవలో అగ్నిప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు యాత్రికులు ప్రాణాలతో బయటపడ్డారు కానీ, లేకపోతే మరో పెనుప్రమాదం జరిగి ఉండేది.
పాత బోటు వల్లే ప్రమాదం...
పర్యాటకులు ఎంతగానో ఇష్టపడే పాపికొండల విహారయాత్రలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 80 మంది యాత్రికులతో వెళ్తున్న పడవ తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్దకు చేరగానే బోటులో ఒక్క సారిగా మంటలు చేలరేగాయి. దీంతో పర్యాటకులు తీవ్ర ఆందోళనకు గురై కేకలు వేశారు. వీరి కేకలు విన్న వీరవరపులంక వాసులు ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. జనరేటర్ వైర్లు సిలిండర్ కి తాకి ఉండవచ్చని లేదా పడవ పాతదైనందున ఇంజిన్ బాగా వేడి అయి ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మంటలకు పడవ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు కాగా మరికొందరు సొమ్మసిల్లి పడిపోయారు. పాపికొండలు యాత్రలోని పడవలో జరిగిన అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే కలెక్టర్ కు ఫోన్చేసి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణాలను అడిగారు. ప్రయాణికులకు అవసరమైన పూర్తస్థాయి వైద్యసేవలు అందించాలని ఆదేశించారు.