ఏడుపు ఎపిసోడ్ కు దూరంగా ఉంది అందుకేనట

రాయలసీమ నుంచి చంద్రబాబుకు మద్దతుగా ఎవరూ పెద్దగా స్పందించలేదు.

Update: 2021-11-26 08:26 GMT

చంద్రబాబు నాయుడు బోరున విలపించారు. తన కుటుంబాన్ని అసెంబ్లీలోకి లాగారంటూ ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. జనం సంగతి పక్కన పెడితే సొంత పార్టీల నేతల నుంచే స్పందన అంతంత మాత్రంగా వచ్చింది. ముఖ్యమైన నేతలెవరూ దీనిపై పెద్దగా మాట్లాడానికి ఇష్టపడలేదు. ప్రధానంగా రాయలసీమ నుంచి చంద్రబాబుకు మద్దతుగా ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే ఏడుపు అంటే అక్కడి నేతలకు గిట్టదు. అందులో జేసీ బ్రదర్స్ ఒకరు.

అందరికంటే ముందుగా....
నిజానికి జేసీ బ్రదర్స్ అందరికంటే ముందుంటారు. టీడీపీ లో కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ వారికి అది తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. అందుకే ఇటీవల అనంతపురానికి వచ్చిన లోకేష్ కు స్వాగతం పలికేందుకు స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చారు. వారికి పార్టీ మారే ఆలోచన లేకపోయినప్పటికీ చంద్రబాబు వద్ద తమ పంచాయతీ తేలాలన్న పట్టుదలతో ఉన్నారు. జిల్లా పార్టీలో తమ పరిస్థితి ఏంటన్నది వారు బాబును నిలదీయాలనుకుంటున్నారు.
కొందరి చేతుల్లోనే....
జిల్లా పార్టీ కొందరి చేతుల్లో పెట్టడాన్ని జేసీ బ్రదర్స్ సహించలేకపోతున్నారు. తమ వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాలకు కూడా తమను వెళ్లకూడదంటూ ఆంక్షలు పెట్టడమేంటని జేసీ బ్రదర్స్ ప్రశ్నిస్తున్నారు. అందుకే చంద్రబాబు ఏడుపు ఎపిసోడ్ కు వారు దూరంగా ఉన్నారని తెలిసింది. జేసీ బ్రదర్స్ కు ఏడుపంటే పడదట. నాయకుడన్న వాడు ఏడవకూడదని, ఏడిపించాలన్నది వారి లక్ష్యం. అందుకే చంద్రబాబు విషయంలో స్పందించలేదంటున్నారు.
తాడో పేడో...
చంద్రబాబును అమరావతిలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ కోటరి ఉంటుందని జేసీ బ్రదర్స్ భావిస్తున్నారు. అందుకే ఆయన హైదరాబాద్ లో ఉన్నప్పుడే వెళ్లి కలవాలని డిసైడ్ అయ్యారు. జిల్లా పర్యటనల్లోనూ ఆయన వెంట కోటరీ ఉంటుందని, తమ మనసులో మాట చెప్పుకోవడానికి హైదరాబాద్ కరెక్ట్ అని జేసీ బ్రదర్స్ భావిస్తున్నారు. మొత్తం మీద జేసీ బ్రదర్స్ ఇక బాబుతో తాడో పేడో తేల్చుకునేందుకే సిద్ధమయ్యారని తెలుస్తోంది.


Tags:    

Similar News