ఆకుటుంబాలను తరిమికొట్టండి

Update: 2018-12-03 13:47 GMT

‘‘ఎందరో అమరవీరులు కన్న కలల సాకారం కోసం...మార్పుకోసం...తెలంగాణ అభివృద్ధికోసం తరలి వచ్చిన తెలంగాణ ప్రజలందరికీ అభివందనం. హైదరాబాద్ అంటే నాకు ఎంతో ఇష్టం. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే నాకు మరింత ఇష్టం. సర్దార్ పటేల్ వల్లనే హైదరాబాద్ కు విముక్తి వచ్చింది. హైదరాబాద్ అంటేనే నాకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తుకు వస్తారు. పటేల్ లేకుంటే నేడు ఈరోజు మీతో స్వేచ్ఛగా మాట్లాడే వీలుండేది కాదు. తెలంగాణ ఉండేది కాదు. ’’ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో తొలుత ప్రసంగించారు. భారతీయజనతా పార్టీ ప్రచారంలో భాగంగా ఆయన ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా జంటనగరాల్లో బీజేపీ అభ్యర్థులను పరిచయం చేశారు.

స్వార్థం కోసమే చంద్రబాబు....

ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కుట్ర దేశంలో జరుగుతుందన్నారు. ఏరాజకీయ పార్టీ కూడా వారసత్వం లేకుండా పనిచేయడం లేదన్నారు. తమ వంశం కోసమే అవి పనిచేస్తున్నాయన్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీలో మాత్రం వారసత్వం లేదన్నారు. ఎంఐఎం వారసత్వ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిందే తెలుగు జాతి ఆత్మాభిమానం కోసం ఏర్పడిన పార్టీ అని, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం నాడు ఎన్టీరామారావు టీడీపీని ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పార్టీని నెలకొల్పారన్నారు. కానీ నేడు స్వార్థం కోసం టీడీపీ అధినేత తన కుమారుడి కోసం కాంగ్రెస్ వద్ద తాకట్టు పెట్టారన్నారు. స్వార్థం కోసం కాంగ్రెస్ తో జత కట్టారన్నారు. టీడీపీ లో వారసత్వ పార్టీ కాదా? అని నిలదీశారు.

టీఆర్ఎస్ కాంగ్రెస్ కు బీటీం....

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కూడా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఏక కుటుంబ పాలన పార్టీలో కొనసాగు తుందన్నారు. ఎందరి త్యాగ ధనులతో ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబానికే పరిమిత మైందన్నారు. ఇక టీఆర్ఎస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, అది కుటుంబ పార్టీ అని మీకందరికి తెలుసునన్నారు. కేసీఆర్,చంద్రబాబులకు నిన్న ఏంచెప్పారో గుర్తుండదని ఎద్దేవా చేశారు. బీజేపీకి టీఆర్ఎస్ బి టీం అన్న రాహుల్ వ్యాఖ్యలపై మోదీ సెటైర్లు వేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ జనతాదళ్ ఎస్ ను బీజేపీకి బి టీం అని రాహుల్ చెప్పారు. అయితే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఆ పార్టీతోనే జట్టుకట్టిందన్నారు. రాహుల్ అబద్ధాలు ఇలాగే ఉంటాయన్నారు. తెలంగాణలో ప్రగతి సాధించాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ లో తొలుత పనిచేసి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారన్నారు. చంద్రబాబుకూడా తొలుత కాంగ్రెస్ వాదేనన్నారు. వీరందరూ కలసి పోవడం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ కు అసలైన బీ టీం అని మోదీ అన్నారు. ఈ వారసత్వ రాజకీయాలు నడిపే పార్టీలను దేశం నుంచి తరిమికొట్టాలని మోదీ పిలుపునిచ్చారు. కుటుంబరాజకీయాలు దేశానికి పెనుముప్పుగా మారతాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

Similar News